ఏప్రిల్ ఫూల్ అంటే మీరే ఫూల్ అవుతారు

ఏప్రిల్ ఫూల్ అంటే మీరే ఫూల్ అవుతారు

ఏప్రిల్ 1.. ఫూల్స్ డే! ఈ రోజున ఏదో అబ‌ద్ధం చెప్పి అవ‌తలి వాళ్ల‌ను న‌మ్మించి.. వాళ్ల‌ను ఫూల్స్ చేయ‌డం, ఏప్రిల్ ఫూల్ అంటూ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించ‌డం చాలా మామూలు విష‌యం. కానీ ఈ ఏడాది ఒక ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల్లో ఉంది. మాన‌వాళి మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారి రూపంలో ఓ విల‌యాన్ని ఎదుర్కొంటోంది. ఈ వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడ‌డానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించింది భార‌త ప్ర‌భుత్తం.

కల్లోలం సృష్టిస్తున్న ఈ క‌రోనాను అంత‌మొందించేందుకు డాక్ట‌ర్లు, ఇత‌ర హెల్త్ స‌ర్వీస్ సిబ్బంది ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా యుద్ధం చేస్తున్నారు. శానిటేష‌న్ సిబ్బంది, పోలీసులు త‌మ కుటుంబాల‌ను సైతం ప‌క్క‌న బెట్టి రోడ్ల‌పై నిల‌బ‌డి ప్ర‌జ‌ల కోసం స‌ర్వీస్ చేస్తున్నారు. జ‌నం ఎక్క‌డికీ క‌ద‌ల‌కుండా ఇళ్ల‌లోనే ఉండండి అని, మీ కోసం మేం రోడ్ల‌పై ఉండి సేవ చేస్తాం అని చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో క‌రోనాపై పిచ్చి పిచ్చి ఫేక్ వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాల్లో పోస్టులు చేయ‌డం త‌గ‌ద‌ని, ఎవ‌రైనా అలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి.

ఫేక్ పోస్టులపై మా వాట్సాప్ నంబ‌రుకు…

ఇప్పుడు ఫూల్స్ డేని అడ్డం పెట్టుకుని ఏప్రిల్ ఫూల్ అంటూ క‌రోనాపై లేనిపోని పోస్టులు పెడితే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హైద‌రాబాద్ సిటీ పోలీసులు స్స‌ష్టం చేశారు. ఫూల్ చేయాల‌ని చూస్తే మీరే ఫూల్ అవుతారంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఎవ‌రైనా క‌రోనాపై ఏప్రిల్ ఫూల్ పేరుతో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి స‌ర్క్యూలేట్ చేస్తే త‌మ వాట్సాప్ నంబ‌ర్ 9490616555 కి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. త‌ప్పుడు ప్ర‌చారాలు చేసే వాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఫూల్స్ చేయాల‌ని చూడొద్దు, ఫూల్స్ అవ్వొద్దు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు హైద‌రాబాద్ సిటీ పోలీస్.

Hyderabad city police warns on false news spread about Coronavirus on April fool day