ఇజ్రాయెల్లో ఉద్యోగాలంటూ  ఈజిప్టులో వదిలేశారు..భారీగా డబ్బులు వసూల్ చేసి బోర్డు తిప్పేసిన ‘సీడీ ఓవర్సీస్ కన్సల్టెన్సీ’

ఇజ్రాయెల్లో ఉద్యోగాలంటూ  ఈజిప్టులో వదిలేశారు..భారీగా డబ్బులు వసూల్ చేసి బోర్డు తిప్పేసిన ‘సీడీ ఓవర్సీస్ కన్సల్టెన్సీ’
  • ఒక్కొక్కరి వద్ద రూ. 8 లక్షల వరకు దండుకుని కార్యాలయం మూసివేత
  • ఇండియాకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.. అప్పులు చేసి, బంగారం కుదువ పెట్టిన నిరుద్యోగులు

మియాపూర్​, వెలుగు: హైదరాబాద్ హఫీజ్​పేట్​లోని ఓ కన్సల్టెన్సీ సంస్థ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఇజ్రాయెల్​ దేశంలో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల వద్ద లక్షల్లో వసూలు చేసి అందరినీ ఈజిప్టు దేశానికి తీసుకువెళ్లి అక్కడే వదిలేశారు. నాలుగు నెలల పాటు ఉద్యోగాల కోసం ఈజిప్టు దేశంలో వేచిచూసి కన్సల్టెన్సీ నిర్వాహకులను నిలదీస్తే.. ఉద్యోగాలు లేవంటూ మాటమార్చేశారు. దీంతో మోసపోయిన బాధితులు తిరిగి ఇండియాకు వచ్చి కన్సల్టెన్సీకి వెళ్లగా, అక్కడ సదరు ఆఫీస్​ను ఎత్తేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. 

 లక్షల్లో వసూలు.. 

నిజామాబాద్​కు చెందిన అరుణ్​ స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్​ మీడియాలో ‘సీడీ ఓవర్సీస్’​ అనే కన్సల్టెన్సీ ద్వారా ఇజ్రాయెల్​ దేశంలో వేర్​హౌజ్​లో సూపర్​వైజర్​ ఉద్యోగాలు, లక్షల్లో జీతం అంటూ వచ్చిన ప్రకటనలు చూసి హఫీజ్​పేట్​ రోడ్డు నెం. 10ఏలో ఉన్న ఆఫీసును సంప్రదించాడు. ఇజ్రాయెల్​లో తమకు తెలిసిన వారు ఉన్నారని, వేర్​హౌజ్​లో సూపర్​వైజర్​ ఉద్యోగాలు ఇప్పిస్తామని, జీతం రూ. 1.80 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు వస్తుందని చెప్పడంతో అరుణ్​ నమ్మాడు.

ఇండియా నుంచి ఇజ్రాయెల్​ డైరెక్ట్​ ప్రాసెస్​ అవ్వడం లేదని, ఈజిప్టు దేశానికి వెళ్తే అక్కడి నుంచి తొందరగా ఇజ్రాయెల్​ వెళ్లిపోవచ్చని కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, స్వామి శంకర్​ పేర్కొన్నారు. ఇందుకోసం మొత్తం రూ. 8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో అరుణ్​ ఒప్పుకున్నాడు. మొదటి విడతగా రూ. 4 లక్షలు ఆన్​లైన్‌లో చెల్లించాడు.

ఆ తర్వాత కన్సల్టెన్సీ నిర్వాహకులు ఈజిప్టు టూరిస్టు వీసా ఇవ్వడంతో అరుణ్​ సొంత డబ్బులతోనే ఈజిప్టులోని కైరో ఎయిర్​పోర్టుకు వెళ్లాడు. అక్కడ సోమ శేఖర్​ అనే వ్యక్తి రిసీవ్​ చేసుకొని రూమ్​ చూపించాడు. జాబ్​ ప్రాసెస్​లో ఉందని, అంతవరకు రూమ్​లో ఉండాలని అరుణ్​కు సూచించాడు. అరుణ్​తో పాటు హైదరాబాద్​ నుంచి బ్యాచ్​ల వారీగా సీడీ ఓవర్సీస్​ కన్సల్టెన్సీ ద్వారా 40 మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఈజిప్టు వెళ్లారు.

ఉద్యోగాల పేరుతో ఆరు నెలలు ఈజిప్టులోనే.. 

ఇజ్రాయెల్​ ఎంప్లాయిమెంట్​ వీసా ప్రాసెస్​ జరుగుతుందని చెబుతూ రెండు నెలలు గడువు పెంచుకుంటూ వచ్చారు. కొద్ది రోజులు ఇరాన్​ వార్​తో లేట్​ అవుతుందని పేర్కొన్నారు. ఆరు నెలల పాటు ఉద్యోగాలు ప్రాసెస్​లో ఉన్నాయని చెబుతుండడంతో అరుణ్​తో పాటు ఇతరులు సోమ శేఖర్​ను నిలదీశారు. దీంతో సోమశేఖర్​ కన్సల్టెన్సీ నుంచి వాట్సాప్​ మెసేజ్​ ద్వారా అందరికీ లాయర్​ నోటీసు పంపించారు.

మీకు కన్సల్టెన్సీకి సంబంధం లేదని అందులోని సారాంశం. మీకు ఉద్యోగాలు లేవంటూ సోమశేఖర్​ బెదిరింపులకు దిగాడు. తమ డబ్బులు ఇచ్చేయాలని అరుణ్​తో పాటు మరికొంత మంది యువకులు డిమాండ్​ చేయగా.. మీరు ఇచ్చిన డబ్బులు జాబ్​ ప్రాసెస్​కు ఖర్చు అయ్యాయని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులందరూ కలిసి ఈజిప్టు కైరోలోని ఇండియా ఎంబసీని ఆశ్రయించారు. ఎంబసీ అధికారులు తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని, మీరు ఇండియాకు వెళ్లి అక్కడి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

బంగారం కుదువ పెట్టి, అప్పులు చేసి.. 

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సీడీ కన్సల్టెన్సీ 40 మంది వద్ద డబ్బులు వసూలు చేసి చీటింగ్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 4 నుంచి రూ. 8 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుసుకున్నారు. 100 మంది వరకు బాధితులు ఉద్యోగాల కోసం డబ్బులు కట్టినట్లు తెలిసింది. విదేశాల్లో ఉద్యోగాలువస్తాయని నమ్మిన బాధితులు బంగారం కుదవ పెట్టి, అప్పులు చేసి మరి డబ్బులు కట్టారు. కొందరు ఇంట్లో తెలియకుండా ఉద్యోగాల కోసం డబ్బులు కట్టారు.

అప్పు చేసి హైదరాబాద్​కు తిరుగుపయనం.. 

అరుణ్​తో పాటు ఉద్యోగాల కోసం ఈజిప్టు వెళ్లిన పలువురు యువకులు తమతో పాటు తీసుకువెళ్లిన డబ్బు మొత్తం అక్కడ తిండి, గది రెంట్​ కోసం ఖర్చు పెట్టారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మోసపోయిన వారందరూ తిరిగి ఇండియాకు వచ్చేందుకు డబ్బులు లేక తెలిసిన వారి వద్ద అప్పు చేసి చేరుకున్నారు. సిటీకి చేరుకున్న తర్వాత అందరూ కలిసి హఫీజ్​పేట్​లోని సీడీ ఓవర్సీస్​ కన్సల్టెన్సీ వద్దకు వెళితే అక్కడ ఆఫీస్​ మూసేశారు. దీంతో అరుణ్​తో పాటు మరికొందరు యువకులు సోమవారం మియాపూర్​ పోలీస్​ స్టేషన్​కు చేరుకొని కన్సల్టెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మియాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.