భగీరథ్ పోక్సో కేసులో సంజయ్‌ పేరు, ఫొటోలు వాడొద్దు : సిటీ సివిల్‌ కోర్టు

భగీరథ్ పోక్సో కేసులో సంజయ్‌ పేరు, ఫొటోలు వాడొద్దు : సిటీ సివిల్‌ కోర్టు
  • శాటిలైట్‌, డిజిటల్‌, సోషల్ మీడియా నుంచి కంటెంట్‌ తొలగించాలి
  •     ప్రత్యేక గ్యాగ్‌ ఆర్డర్‌‌ జారీ చేసిన సిటీ సివిల్‌ కోర్టు
  •     తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని కోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి సంజయ్​
  •     బాధితురాలి వ్యక్తిగత వివరాలు ప్రసారం చేసిన సోషల్ మీడియాపై కేసులు

హైదరాబాద్, వెలుగు: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేరు, ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయొద్దని, సంజయ్‌ పేరు, ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య, అభ్యంతరకర విషయాలను ప్రసారం చేయొద్దని సిటీ సివిల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బండి సంజయ్ పేరుతో శాటిలైట్‌, యూట్యూబ్ చానల్స్​తో పాటు ఫేస్‌బుక్‌, ఎక్స్‌ సహా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్​లో ఇప్పటికే ప్రసారం చేసిన అన్ని వీడియోలు, కంటెంట్​ను తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులో కూడా పోక్సో కేసు వ్యవహారంలో ఆయన పేరు సహా ఇతర వివరాలు ప్రసారం చేయొద్దని సూచించింది. ఈ మేరకు ప్రత్యేక గ్యాగ్ ఆర్డర్‌‌ను జారీ చేసింది. 

ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చట్టం సహా ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా భాధ్యతలు నిర్వర్తిస్తున్న తన పేరు, ఫొటోలతో అభ్యంతరకర కథనాలు ప్రసారం చేస్తున్నారని బండి సంజయ్‌ శుక్రవారం సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని వివరించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. న్యాయ ప్రక్రియకు భంగం వాటిల్లకుండా మీడియా ట్రయల్స్‌ నిర్వహించవద్దని పేర్కొంది. 

సోషల్ ​మీడియా నిర్వాహకులపైనా కేసులు

బాధిత బాలిక, ఆమె కుంటుంబ సభ్యుల వివరాలను సోషల్​ మీడియాలో ప్రసారం చేస్తున్న పలువురిపై పేట్‌ బషీరాబాద్  పోలీసులు  కేసులు నమోదు చేశారు. మేడ్చల్​-మల్కాజిగిరి  జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. ఇన్​స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్‌లలో బాలికతో పాటు ఆమె తల్లిదండ్రుల వివరాలను ప్రచారం చేసిన పలు సోషల్‌మీడియాకు సంబంధించిన యూఆర్ఎల్‌లు సేకరించారు. ఈ మేరకు14 సోషల్​మీడియా ఫ్లాట్​ఫామ్స్‌ నిర్వాహకులపై  కేసులు నమోదైనట్టు సమాచారం. వీరందరిని త్వరలోనే విచారిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా, పోక్సో కేసులో బాధిత బాలిక వ్యక్తిగత వివరాలు, తల్లిదండ్రుల వివరాలు, ఫొటోలు ప్రచురించడం, ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.