క్యునెట్ పిరమిడ్ భారీ మోసం ..లగ్జరీ లైఫ్ ఆశ చూపి కోట్లు టోకరా.. ఐటీ ఉద్యోగులే టార్గెట్

క్యునెట్ పిరమిడ్ భారీ మోసం ..లగ్జరీ లైఫ్ ఆశ చూపి కోట్లు టోకరా.. ఐటీ ఉద్యోగులే టార్గెట్

మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్‌ల పేరుతో అమాయకులను ముంచేస్తున్న క్యునెట్ (QNET) ముఠాపై హైదరాబాద్ పోలీసులు విరుచుకుపడ్డారు. సిసిఎస్–ఈఓడబ్ల్యూ (CCS-EOW) టీమ్-1 చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. గోవాలోని ప్రముఖ 'నోవోటెల్ రిసార్ట్'లో జరుగుతున్న ఈవెంట్‌పై దాడి చేసిన పోలీసులు.. కేరళకు చెందిన ఐదుగురు క్యునెట్ ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

గోవాలో క్యునెట్ నిర్వహించిన Ocean 25th Anniversary వేడుకలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. దాడి సమయంలో పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించిన నిందితులను వెంటాడి మరీ పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ సోదాల్లో నిందితుల నుంచి టయోటా ఫార్చ్యూనర్, కియా, ఎంజీ హెక్టర్ లాంటి 3 లగ్జరీ కార్లతో పాటు 5 మొబైల్ ఫోన్లు, వాట్సాప్ చాట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలు మరియు కీలకమైన ఆర్థిక లావాదేవీల డిజిటల్ ఆధారాలను సీజ్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వల విసిరిన ఈ ముఠా.. ఒక బాధితుడికి వ్యాపార అవకాశాల పేరుతో ఆశ చూపి రూ.7.5 లక్షలు పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, గోవా ఈవెంట్ ఎంట్రీ పేరుతోనే రూ.30 వేలు వసూలు చేశారు. పోలీసులకు అనుమానం రాకుండా జూమ్ మీటింగ్‌లు, సీక్రెట్ ఫోన్ కాల్స్ ద్వారానే ఈ వ్యవహారాన్ని నడిపినట్లు విచారణలో తేలింది. కొత్త సభ్యులను చేర్పిస్తే కోట్లలో సంపాదించవచ్చంటూ రంగుల కలలు చూపించి మోసానికి పాల్పడ్డారు.

ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువత, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా ఈ పిరమిడ్ మోసాలు సాగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. క్యునెట్ వంటి మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్‌లకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి మోసపూరిత స్కీమ్‌లను ప్రచారం చేసినా, సభ్యులను చేర్పించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.