పద్మారావునగర్, వెలుగు: చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కోర్టు 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని బోయిన్‌పల్లిలో 2020లో నమోదైన ఈ ఘటనపై విచారణ పూర్తి చేసిన హైదరాబాద్ హాకా భవన్‌లోని పోక్సో కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్ సిక్ విలేజ్ ప్రాంతానికి చెందిన నిందితుడు వరదరాజ్ సుదేశ్ ఉమేశ్ (39) రామ్ గోపాల్పేట్పీఎస్లో కానిస్టేబుల్. 2020లో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీనిపై బోయిన్‌పల్లి పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జి.ఉదయ్ భాస్కర్ రావు.. నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో పాటు రూ.12 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. బాధితురాలికి కలిగిన నష్టానికి ప్రభుత్వం, నిందితుడి తరపున కలిపి రూ.లక్ష పరిహారం అందజేయాలని పేర్కొన్నారు.
