హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ‘క్యూనెట్’ -విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలోని ఐదుగురు నిందితులను గోవాలో హైదరాబాద్ సీసీఎస్, ఈఓడబ్ల్యూ పోలీసులు పట్టుకున్నారు. కాండోలిమ్‌లోని ‘నోవోటెల్ రిసార్ట్ అండ్ స్పా‘లో నెట్‌వర్క్ ఈవెంట్ జరుగుతుండగా మెరుపు దాడి చేశారు.
కేరళకు చెందిన మహ్మద్ ఫవాజ్, అశ్విన్ సురేశ్, విను జాన్సన్ డిక్రూజ్, మనోజ్ రవీంద్రన్ నాయర్, శివరాజన్ బలరాజ్ ను అరెస్టు చేశారు. వారి నుంచి లగ్జరీ కార్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తరలించారు.
రూ. 7.50 లక్షల పెట్టుబడికి స్కెచ్
హైదరాబాద్‌కు చెందిన సర్దార్ శరణ్‌పాల్ సింగ్ జిమ్ ఏర్పాటు చేయడానికి ఖాళీ స్థలం వెతుకుతుండగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహ్మద్ ఫవాజ్ పరిచయమయ్యాడు. లగ్జరీ వ్యాపారంలో నెలకు రూ. 3 నుంచి 4 లక్షలు సంపాదించవచ్చని నమ్మించి రూ. 7.50 లక్షలు పెట్టుబడి పెట్టించేందుకు ప్లాన్ చేశారు. గోవా ఈవెంట్ పొజిషన్ రిజర్వేషన్ పేరిట రూ. 25,000 వసూలు చేశారు. ఇది మనీ సర్క్యులేషన్ మోసమని గ్రహించిన బాధితుడు జులై 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గోవాకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుంది. నిందితులపై వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేసి, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
