మెక్సికన్ బాడ్మింటన్ టోర్నీలో సిటీ షట్లర్ కు స్వర్ణం

మెక్సికన్ బాడ్మింటన్ టోర్నీలో సిటీ షట్లర్ కు స్వర్ణం

పద్మారావునగర్, వెలుగు: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై నగరానికి చెందిన షట్లర్ శ్రీయాన్సీ వలిశెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. మెక్సికోలో జరిగిన ‘మెక్సికన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ షటిల్ బాడ్మింటన్ టోర్నమెంట్’ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఆమె బ్రెజిల్ క్రీడాకారిణి జులియాన వైనవెయిరాపై విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 

నల్గొండ జిల్లాకు చెందిన శ్రీయాన్సీ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్​లో స్థిరపడగా, ఆమె తండ్రి రామకృష్ణ చిలకలగూడ పీఎస్​లో ఇన్​స్పెక్టర్‌గా, తల్లి అనుపమ స్కూల్ అసిస్టెంట్​గా పనిచేస్తున్నారు. నగరంలోని కేఎల్ఎన్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న శ్రీయాన్సీ.. పుల్లెల గోపిచంద్ బాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. గతంలోనూ పలు అంతర్జాతీయ పతకాలు సాధించిన ఆమె.. భవిష్యత్తులో ఒలింపిక్స్​లో దేశానికి మెడల్ సాధించడమే తన లక్ష్యమని ధీమా వ్యక్తం చేసింది.