పంజాగుట్టకు రేషన్ కార్డు కోసం వచ్చింది.. హనీట్రాప్ తో ప్రభుత్వ ఉద్యోగికి బెదిరింపులు

పంజాగుట్టకు రేషన్ కార్డు కోసం వచ్చింది.. హనీట్రాప్ తో  ప్రభుత్వ ఉద్యోగికి బెదిరింపులు
  • రేషన్ కార్డు కోసం వచ్చి హనీట్రాప్!...
  • పంజాగుట్టలో నిందితురాలు అరెస్ట్
  • ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.6 లక్షలు వసూల్

పంజాగుట్ట, వెలుగు: రేషన్ కార్డు కోసం వచ్చి ప్రభుత్వ ఉద్యోగిని ఓ మహిళ హనీ ట్రాప్ చేసింది. ఫొటోలు, వీడియోలే కాకుండా ఓయో రూమ్ స్లిప్పులు తన వద్ద పెట్టుకుని బెదిరింపులకు దిగింది. ఎట్టకేలకు బాధితుడి ఫిర్యాదుతో ఆమెను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

పంజాగుట్ట ఇన్​స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్​నగర్​కు చెందిన లక్ష్మి (40) భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. 2022 జూన్​లో రేషన్ కార్డు కోసం ఖైరతాబాద్ సివిల్ సప్లై ఆఫీసులో దరఖాస్తు చేసుకుంది. కార్డు పని మీద ఆఫీసుకు తిరుగుతూ, అక్కడ ఎల్డీసీగా పనిచేస్తున్న సాయికిరణ్ అనే ఉద్యోగితో పరిచయం పెంచుకుంది. 

ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని సాయికిరన్​ను లక్ష్మి తన వలలో వేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ ఓయో రూమ్​లకు వెళ్లడం, ఆమె ఇంటికి అతడు రావడం వంటివి సాగాయి. ఈ క్రమంలోనే పెండ్లి చేసుకుంటానని నమ్మించి సాయికిరణ్ నుంచి డబ్బులు లాగడం మొదలుపెట్టింది. మొదట్లో రూ.5 వేలతో మొదలుపెట్టి ఆ తర్వాత లక్షల్లో డిమాండ్ చేసింది. గతంలో మధురానగర్ పోలీస్ స్టేషన్​లో సాయికిరణ్​పై ఆమె ఫిర్యాదు కూడా చేసింది. 

తమ ఇద్దరి ఫొటోలు, ఓయో రూమ్ రసీదులను పోలీసులకు చూపిస్తానని బెదిరించి అప్పట్లో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఇలా ఇప్పటివరకు రూ.6 లక్షల వరకు స్వాహా చేసింది. ఇటీవల కొడుకు ప్రవర్తన, ఆఫీస్ విషయాలపై అనుమానం వచ్చిన సాయికిరణ్ తల్లి భూదేవి అతడిని గట్టిగా నిలదీయడంతో ఈ మోసం బయటపడింది. లక్ష్మి చేతిలో బ్లాక్​మెయిలింగ్​కు గురవుతున్నట్లు కొడుకు చెప్పడంతో ఆమె పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా, మోసం నిజమేనని తేలింది. దీంతో సోమవారం ఆమెను రిమాండ్​కు తరలించినట్లు ఇన్​స్పెక్టర్ తెలిపారు.