- కూకట్ పల్లిలోని గోపాల్ నగర్ లో కబ్జాల తొలగింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్-–- మల్కాజ్గిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలోని గోపాల్‌నగర్‌లో 3,300 గజాల రూ.34 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 148 నుంచి 155 వరకూ ఉన్న సర్వే నంబర్లలో 1980లో 92.21 ఎకరాల మేర గోపాలనగర్ పేరిట లేఔట్ వేశారు. ఇక్కడ 1200కు పైగా ప్లాట్లున్నాయి. ఇందులో పార్కుల కోసం మూడు చోట్ల భూమిని కేటాయించారు. ఇప్పటికే రెండు చోట్ల పార్కులు దాదాపు ఆక్రమణలకు గురికాగా.. మూడో పార్కు కూడా కబ్జాలకు గురవుతోందని గోపాల్‌నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ కంప్లయింట్‌పై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విచారణకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో హైడ్రా అధికారులు పార్కును పరిశీలించారు. పార్కు స్థలం కబ్జా అవుతున్నట్టు నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో శుక్రవారం పార్కులో షెడ్డును తొలగించారు. పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు. ఈ స్థలం విలువ దాదాపు రూ.34 కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా.
