ఏదో ఓ రోజు వరల్డ్‌‌కప్‌‌ ఆడతా.!

ఏదో ఓ రోజు వరల్డ్‌‌కప్‌‌ ఆడతా.!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌లో ఇటీవల ముగిసిన వరల్డ్‌‌కప్‌‌లో ఆడిన టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్‌‌ అయ్యర్‌‌ భవిష్యత్తులో ప్రపంచకప్‌‌ ఆడి తీరుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఇండియా టీమ్‌‌ తరఫున 6 వన్డేలు, 6 టీ20లు ఆడిన 24 ఏళ్ల అయ్యర్‌‌.. ఐపీఎల్‌‌లో కెప్టెన్‌‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను తొలిసారి ప్లే ఆఫ్స్‌‌కు చేర్చాడు.  దీంతో 2019 వరల్డ్‌‌కప్‌‌ జట్టులో అతను ఉంటాడని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్‌‌ ఫ్లైట్‌‌ ఎక్కలేకపోయిన శ్రేయస్‌‌, వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్‌‌ టూర్‌‌కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో జట్టు సెలెక్షన్‌‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.  ‘గత రికార్డుల వల్ల వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌ సెలెక్షన్‌‌ ముందు నా పేరు బాగా వినిపించింది.  కానీ జట్టు కాంబినేషన్స్‌‌ వల్ల ప్లేస్‌‌ దొరకలేదు. వరల్డ్‌‌కప్‌‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా కోరిక. ఏదో ఓ రోజు దీనిని తీర్చుకుంటా.  ఇతర అంశాలకు నేను పెద్దగా ప్రాధాన్యమివ్వను. నా దృష్టంతా  ఆటను మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుంది. టీమ్‌‌లో స్థానం నిలబెట్టుకోవాలంటే ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. ఓ యువ ఆటగాడు చుట్టంలా టీమ్‌‌లోకి వస్తూ పోతూ ఉంటే అతనిలో ఉండే నమ్మకం సడలుతుంది’ అని శ్రేయస్‌‌ పేర్కొన్నాడు. సీనియర్‌‌ జట్టులోకి ఎంపికవడమనేది ఆటగాళ్ల చేతుల్లో లేదన్న అయ్యర్‌‌..  నిలకడగా రాణించడంపైనే దృష్టి పెట్టాలన్నాడు. అవకాశం దొరికిన ప్రతీ చోట బాగా ఆడి సత్తా ఏమిటో చూపిస్తేనే సెలెక్టర్లు గుర్తిస్తారని అప్పుడు అవకాశాలు వస్తాయని తెలిపాడు.