- విమర్శలు అసలు పట్టించుకోను
- భార్య, కుమార్తెతో సంతోషంగా ఉన్నా
న్యూఢిల్లీ: క్రికెట్ పట్ల తన ఆలోచనా విధానం చాలా భిన్నంగా ఉంటుందని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తాను కంప్లీట్‌గా ‘ఫ్యామిలీ మ్యాన్’ అని చెప్పిన హిట్‌మ్యాన్.. భార్య రితికా, కుమార్తె సమైరాతో చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించాడు. ‘నా కుటుంబం పంచుతున్న ప్రేమతో చాలా సంతోషంగా ఉన్నా. ప్రస్తుతం నేను అత్యుత్తమ దశలో ఉన్నా. ఆ పరిధిలోనే జీవిస్తున్నా. నా గురించి బయటి వారు ఏం మాట్లాడుతున్నారనే దానిని పట్టించుకోను. ఆ వయసు కూడా ఎప్పుడో దాటేశా. కాబట్టే విమర్శలను లెక్క చేయను’ అని రోహిత్ వెల్లడించాడు.
కెరీర్ మొదట్లో టెస్ట్ క్రికెట్ గురించి తీవ్రంగా ఆలోచించేవాడినని చెప్పాడు. ఎలా ఔటయ్యాను, ఈ షాట్ ఇలా ఎందుకు ఆడానని మదనపడేవాడినన్నాడు. ఈ అంశాలపై వీడియో విశ్లేషకుల దగ్గరకు వెళ్లి పదేపదే చర్చించి మరింత గందరగోళానికి గురయ్యే వాడినని గుర్తు చేసుకున్నాడు. ‘అప్పట్లో టెక్నిక్ గురించి ఎక్కువగా ఆలోచించి గేమ్‌ను ఆస్వాదించలేకపోయా. టెస్ట్‌ల్లో బాగా ఆడాలని పదేపదే అనుకునేవాడిని. ఆ ఒత్తిడిని అధిగమించడంలో నేను విఫలమయ్యా. కానీ తర్వాత నాలో మార్పు వచ్చింది. 2018–19 సిరీస్‌కు ముందు ఏం జరిగినా టెక్నిక్ గురించి ఆలోచించొద్దని నా అంతరాత్మకు చెప్పుకున్నా.
సౌతాఫ్రికా సిరీస్ నాకు లాస్ట్ చాన్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఆటగాడిగా నేను అలా అనుకోలేదు. ఆ మైండ్‌సెట్ ఉంటే ఏ ప్లేయర్ రాణించలేడు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ ఆలోచనలు ఉండకూడదు. ఇలాగే ఆలోచిస్తే నా కెరీర్ చాలా రోజులు కొనసాగదని తెలుసు. అందుకే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్లేస్ సుస్థిరం చేసుకోవాలని భావించా. ఆ సమయంలో నేను రాణించడం నేను చేసుకున్న అదృష్టం. ప్రతి ప్లేయర్ గురించి ఏవో విమర్శలు ఉండనే ఉంటాయి. వాటి గురించి బాధపడకూడదు. అందుకే అవి మన జోలికి రాకుండా ఓ రక్షణ గోడ ఏర్పాటు చేసుకోవాలి’ అని ఈ ముంబైకర్ వివరించాడు. ఇదే విషయాన్ని వికెట్ కీపర్ పంత్‌కు కూడా చెప్పానని రోహిత్ తెలిపాడు. ప్రతి మ్యాచ్‌లో అతను సెంచరీ చేయాలని కోరుకుంటారని, సలహాలు, సూచనలు ఎక్కువగా ఇవ్వడంతో ఒత్తిడికి లోనవుతున్నాడని చెప్పాడు. అందుకే తన చుట్టూ ఓ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించానన్నాడు.
ఫ్యామిలీ జోలికి వెళ్లొద్దు..
వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా కొందరు సీనియర్ క్రికెటర్లు గడువు ముగిసినా తమ ఫ్యామిలీలతో స్టే చేశారన్న ఆరోపణలపై హిట్‌మ్యాన్ స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలు తమ కుటుంబ సభ్యులను బాధిస్తాయన్నాడు. ‘మా కుటుంబ సభ్యులు మాకు మద్దతు తెలుపుతూ మమ్మల్ని సంతోషంగా ఉంచేందుకు అక్కడికి వచ్చారు. ఈ విషయంలో వచ్చిన రూమర్లను నా స్నేహితులు నా దగ్గర ప్రస్తావిస్తే నవ్వొచ్చింది. అయినా ఇలా కుటుంబాలను వివాదాల్లోకి లాగడం సరైంది కాదు. మా గురించి ఎంతైనా మాట్లాడండి. కానీ మా ఫ్యామిలీల జోలికి రావద్దు. ఇదే విషయాన్ని విరాట్ కూడా చెప్పాడనుకుంటా. మా జీవితాల్లో మాకు ఫ్యామిలీస్ చాలా ముఖ్యం’ అని రోహిత్ పేర్కొన్నాడు.

