ఐ అండ్ పీఆర్ లో అక్రెడిటేషన్ల దందా!..అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్లు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు గండి

ఐ అండ్ పీఆర్ లో అక్రెడిటేషన్ల దందా!..అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్లు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు గండి
  • ఒక్క కాపీ ముద్రించని ఆన్​లైన్ పత్రికలకూ ఇష్టారాజ్యంగా కార్డులు
  • ఫేక్ సీఏ సర్టిఫికెట్లను వెరిఫై చేయకుండానే కార్డులు జారీ చేస్తున్న ఆఫీసర్లు
  • స్టేట్ కార్డు50 వేలు, జిల్లా కార్డు30 వేలకు బేరం పెడుతున్న కొన్ని మేనేజ్​మెంట్లు
  • సీఏ లెటర్స్​ను మండలాలవారీగా ఇవ్వాలంటూ అడ్డగోలు రూల్స్
  • సర్య్కులేషన్ ఉన్న ‘వెలుగు’ లాంటి పత్రికలను సతాయిస్తున్న డీపీఆర్వోలు
  • అదే కొన్ని ప్రధాన పత్రికలకు రెండు సంస్థల పేర్లతో అక్రెడిటేషన్లు జారీ

హైదరాబాద్, వెలుగు: అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్​కార్డులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు ఐఅండ్​పీఆర్​(సమాచార పౌరసంబంధాల శాఖ) అధికారులు గండికొడ్తున్నారు. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగానే అక్రెడిటేషన్​ కార్డులు ఇవ్వాలని పైస్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాల్లో డీపీఆర్వోలు అమలుచేయడం లేదు.

-ఒక్క కాపీ ముద్రించని ఆన్ లైన్ పత్రికలకూ ఇష్టారాజ్యంగా కార్డులు జారీ చేస్తున్నారు. -చార్టెడ్​ అకౌంటెంట్ల పేరుతో జారీ చేసిన ఫేక్ సర్క్యులేషన్​ సర్టిఫికెట్లు, డబ్బులు తీసుకొని ఊరూపేరూ లేని పేపర్లకు కార్డులు కట్టబెడ్తున్నారు. సర్క్యులేషన్​కు సంబంధించి కీలకమైన పీఆర్​జీఐ (ప్రెస్​రిజిస్ట్రార్​ జనరల్​ఆఫ్​ ఇండియా) సర్టిఫికెట్​ ఉన్న ‘వెలుగు’ లాంటి దినపత్రికలో పనిచేసే మండల విలేకరులకు అక్రెడిటేషన్​కార్డులు ఇవ్వకుండా సతాయిస్తున్నారు.

బిగ్ పేపర్స్ కేటగిరీలో అక్రమంగా ఎంట్రీ.. 

ఆయా న్యూస్​పేపర్ల సర్క్యులేషన్​ను బట్టి గతంలో  ‘వెలుగు’ సహా నాలుగైదు దినపత్రికలు మాత్రమే ‘బిగ్ పేపర్స్’ కేటగిరీలో ఉండేవి.  ప్రస్తుతం ఐఅండ్​పీఆర్ ఆఫీసీర్లు బిగ్ పేపర్స్ లిస్టులో వెయ్యి సర్క్యులేషన్​ కూడా లేని పలు పత్రికలను యాడ్ చేశారు. దాదాపు 17 పత్రికలతో ఈ లిస్టును ఇటీవల విడుదల చేశారు. అందులో సింగిల్​ కాపీ కూడా ప్రింట్​చేయని ఆన్ లైన్ పత్రికలూ ఉన్నాయి.  

ఆన్ లైన్ పేపర్లకు వందల కొద్దీ సర్క్యులేషన్​ఉన్నట్టు ఫేక్​సీఏ(చార్టెడ్​అకౌంటెంట్​) సర్టిఫికెట్లు ఇవ్వగానే కనీసం వెరిఫై చేయకుండా గుడ్డిగా కార్డులు జారీ చేశారు. ఇలా ప్రతి జిల్లాలో ఆన్ లైన్ పత్రికలకు 180 నుంచి 250 కార్డుల వరకు అక్రమంగా ఇచ్చేశారు. కానీ ‘వెలుగు’ పత్రికకు ‘పీఆర్​జీఐ సర్టిఫికెట్’ ఉన్నప్పటికీ సీఏ సర్టిఫికెట్లు తేవాలని వేధిస్తున్నారు. సీఏ సర్టిఫికెట్లు ప్రచురణ కేంద్రాల వద్దే ఇస్తారనే కనీస జ్ఞానం లేని ఐఅండ్​పీఆర్​ఆఫీసర్లు పెట్టిన నిబంధన వల్ల ఫేక్​సర్టిఫికెట్లు తేలేక ‘వెలుగు’ విలేకరులు అక్రెడిటేషన్​కార్డులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ‘వెలుగు’ పత్రికకు కార్డులు ఇవ్వాలని కలెక్టర్లు, అక్రెడిటేషన్ కమిటీలు తీర్మానం చేసినా.. పలువురు డీపీఆర్వోలు పెడచెవిన పెడుతున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని  ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడి డీపీఆర్వోలు ‘వెలుగు’లో పని చేస్తున్న మండల విలేకర్లకు రెండు వారాల కిందటే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేశారు. కానీ దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్​నగర్, నల్లగొండ, మెదక్​ జిల్లాల్లో ఉన్న డీపీఆర్వోలు.. కార్డులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు.  

కొన్ని పత్రికలకు రెండు సంస్థల పేర్లతో అక్రెడిటేషన్లు.. 

కొన్ని ప్రధాన పత్రికలకు రెండు సంస్థల పేర్లతో అక్రెడిషన్ కార్డులు జారీ చేస్తున్నారు. బిగ్ పేపర్స్ లిస్టులో ఉన్న ఓ పెద్ద పత్రికకు దాని పబ్లికేషన్స్ పేరు మీద అందులో పనిచేస్తున్న బ్యూరోలు, స్టాఫ్​ రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లకు కార్డులు జారీ చేశారు. ఇదే సంస్థకు అనుబంధంగా ఉన్న న్యూస్​ ఏజెన్సీ పేరుతో మరో లెటర్ ఇవ్వగా, ఆ లెటర్ ఆధారంగా మండలాల విలేకర్లకు కార్డులు ఇచ్చేశారు.

అలాగే మరో పెద్ద పత్రికలో పని చేస్తున్న బ్యూరోలు, స్టాఫ్​రిపోర్టర్లు,  సబ్ ఎడిటర్లకు దాని పబ్లికేషన్స్​ పేరిట, మండలాల విలేకరులకు న్యూస్​ ఏజెన్సీ పేరుతో అక్రెడిటేషన్ కార్డులు జారీ చేశారు. ఇది ని బంధనలకు విరుద్ధం. వాస్తవానికి ఒక పత్రికకు ఒకే సంస్థ పేరు మీద అందులో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలనే నిబంధన ఉంది. ఐఅండ్​పీఆర్​ ఆఫీసర్లు మాత్రం నిబంధనలను పక్కకు పెట్టి అక్రమంగా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తున్నా అడిగేవారు లేరు. 

స్టేట్ కార్డుకు రూ.50 వేలు, జిల్లా కార్డుకు రూ.30 వేలు

ఫేక్ సీఏ సర్టిఫికెట్లతో అక్రమంగా అక్రెడిటేషన్ కార్డులు పొందిన కొన్ని ఆన్ లైన్ పత్రికల నిర్వాహకులు.. కార్డులను పెద్ద మొత్తంలో అమ్ముకుంటున్నారు. వీరు పంపిన లిస్టుల్లో ఉన్న వ్యక్తుల గురించి ఆఫీసర్లు ఎంక్వైరీ చేయకుండానే కార్డులు జారీ చేశారు. ఇలాంటి పేపర్ల నిర్వాహకులు జిల్లాల్లో ఒక్కో అక్రెడిటేషన్ కార్డుకు ఒక్కో రేట్ ఫిక్స్ చేశారు. స్టేట్ అక్రెడిటేషన్​కార్డుకు రూ.50 వేలు, జిల్లా ​కార్డుకు రూ.30 వేల చొప్పున అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఫేక్ ​సీఏ ​లెటర్స్​పై ఎంక్వైరీకి ఆదేశించి, అనర్హులకు ఇచ్చిన కార్డులను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్​ వినిపిస్తోంది. 

క్వాలిటీ లేని కార్డులు.. కనిపించని పేర్లు..

అత్యాధునిక ​టెక్నాలజీ, క్యూ ఆర్​కోడ్​తో క్వాలిటీగా అక్రెడిటేషన్​ కార్డులను ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఇచ్చిన ఆదేశాలను ఐఅండ్ పీఆర్ అధికారులు తుంగలో తొక్కారు. మూడు విడతల్లో పంపిణీ చేసిన కార్డుల్లో ఏమాత్రం క్వాలిటీ లేదు. కార్డుల డిజైన్ అత్యంత పేలవంగా ఉండడంతోపాటు కార్డులపై పేర్లు కనిపించడం లేదు. రెండో విడత జారీ చేసిన కార్డుల్లో కొందరి ఫొటోలు సగం వరకు కట్ అయ్యాయని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్డుల ముద్రణను ఒక్కో దఫా ఒక్కో కాంట్రాక్ట్​ సంస్థకు అప్పగించారని, ఈ క్రమంలో భారీగా చేతులు మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు