జన్నారం, వెలుగు: భర్త వేధింపులు, అక్రమ సంబంధం పేరుతో వేధింపులకు గురి చేయడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలానికి చెందిన జోత్స్న(27)ను మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామానికి చెందిన కస్తూరిపూరి నాగరాజుతో ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి బాబు ఉన్నాడు. నాగరాజు ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయ్ వెళ్లి నెల రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్య జోత్స్నపై అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వేధిస్తున్నాడు.
ఈ నెల 20న అర్ధరాత్రి జోత్స్న తన తండ్రి ఖర్గే మాధవరావుకు ఫోన్ చేసి, భర్త హింసిస్తున్నాడని తెలిపింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఉన్న గుర్తుతెలియని మందు తాగి, చున్నీతో ఉరివేసుకుంది. అత్తింటివారు జోత్స్నను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది.
జోత్స్న జన్నారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. భర్త, అత్తింటి వారి వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని మృతురాలి తండ్రి మాధవరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.
