12వ వేతన ఒప్పందం వెంటనే ప్రారంభించాలి... జులై 1న సింగరేణి వ్యాప్తంగా నిరసనలు: కార్మిక సంఘాల జేఏసీ

12వ వేతన ఒప్పందం వెంటనే ప్రారంభించాలి... జులై 1న సింగరేణి వ్యాప్తంగా నిరసనలు: కార్మిక సంఘాల జేఏసీ

గోదావరిఖని, వెలుగు: బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించిన 12వ వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డు అమలు కోసం జులై 1న సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు. 

మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన సమావేశంలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ ప్రధాన కార్యదర్శి బి.జనక్ ప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి టి.రాజారెడ్డి, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్ రాష్ట్ర నాయకుడు సారయ్య పాల్గొని మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను బొగ్గు పరిశ్రమలో అమలు చేయాలని చూస్తోందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ నాలుగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ వేతన ఒప్పందాన్ని లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే చర్చలు ప్రారంభించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. 

సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, నాలుగు లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల రద్దు, 12వ వేతన ఒప్పందం కోసం భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. జులై 1న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని, జేఏసీ సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఎస్. నరసింహారెడ్డి, ఎల్లా గౌడ్, కె.స్వామి, రంగు శ్రీను, ధర్మపురి, రాజమౌళి, అనిల్ రెడ్డి, రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.