బాలాపూర్, వెలుగు: పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ ఖాసీం ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలాపూర్ మండలం మల్లాపూర్‌లో జరిగింది. బాలాపూర్ సీఐ ఎం.సుధాకర్ వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ ఖాసీం(30) యాకుత్‌పురాలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ మల్లాపూర్ రికవరీ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి ఖాసీం తన డ్యూటీ ముగించుకుని రూమ్ నంబర్ 201కి రెస్ట్ తీసుకునేందుకు వెళ్లారు.
మంగళవారం ఉదయం వరకు ఆయన బయటకు రాకపోవడంతో సిబ్బంది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా, అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు. ఆ గదిలో రెండు మత్తు ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మరోవైపు, రికవరీ ఆస్పత్రి యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఖాసీం ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
