- ఇండియాపై ఎన్నో ఆశలు
- మిథాలీ జులన్ కు ఇదే చివరి టోర్నీ
- రేపటి నుంచి విమెన్స్ వన్డే వరల్డ్ కప్
ఇండియా మెన్స్ క్రికెట్ టీమ్ ఇప్పటికే రెండు వన్డే వరల్డ్ కప్స్ గెలిచింది. పలువురు లెజెండ్స్, స్టార్ ప్లేయర్లు వరల్డ్ కప్‌ను అందుకున్నారు. కానీ, విమెన్స్ టీమ్ మాత్రం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విశ్వ విజేత అనిపించుకోలేకపోయింది. దశాబ్దాలుగా పోరాడుతున్న మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి లెజెండ్స్.. మంధాన, హర్మన్‌ప్రీత్ వంటి స్టార్స్‌కు ప్రపంచ కప్ ఓ కలగానే మిగిలింది. గత ఐదారేళ్లలో అమ్మాయిల క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. మన టీమ్ ఆట మెరుగైంది. అయితే, 2017 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 2020 టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ దాకా వచ్చిన అమ్మాయిలు.. కప్పు నెగ్గలేకపోయారు. ఈ నేపథ్యంలో తమ కలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా మిథాలీరాజ్ కెప్టెన్సీలోని ఇండియా మరోసారి వరల్డ్ వార్‌కు రెడీ అయింది. న్యూజిలాండ్ గడ్డపై శుక్రవారం మొదలయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీమ్‌లో అత్యంత సీనియర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామికి వయసు దృష్ట్యా ఇదే చివరి వరల్డ్ కప్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రోఫీతో తమ కెరీర్‌ను పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తున్నారు.
అందరూ రాణిస్తేనే
ఈ వరల్డ్‌కప్‌నకు 12 నెలల ముందు ఇండియా.. నాలుగు ప్రధాన జట్లతో పోటీ పడింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఆడిన మిథాలీ సేన తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో పాటు ఈ మధ్యే న్యూజిలాండ్ టూర్‌కు వచ్చింది. కానీ, నాలుగు సిరీస్‌ల్లో ఒక్కటి కూడా నెగ్గలేదు. అయితే, ఈ ఫలితాలను చూసి ఇండియాపై ఓ అంచనాకు రాలేం. ఎందుకంటే ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ మిథాలీ రాజ్ నిలకడగా ఆడుతున్నారు. పవర్ హిట్టర్స్ షెఫాలీ వర్మ, రిచా ఘోష్ రాకతో బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్‌కు వచ్చినా ఇండియా నిలకడగా 270 స్కోర్లు చేయగలిగే స్థాయికి చేరుకుంది. ఎప్పటి నుంచో బలంగా ఉన్న స్పిన్ డిపార్ట్‌మెంట్‌కు తోడు నలుగురు ఫ్రంట్‌లైన్ పేసర్లు అందుబాటులో ఉండటం సానుకూలాంశం. షెషాలీ, మంధాన, మిథాలీ, దీప్తి శర్మ, రిచా ఘోష్, జులన్, హర్మన్ తదితరులంతా ప్రతిభావంతులే. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే. కానీ, ప్రతీ మ్యాచ్‌లో ఒకరిద్దరు మాత్రమే రాణించి మిగతా వాళ్లు ఫెయిలవడం వల్లే కొన్నాళ్లుగా టీమ్ ఆశించిన స్థాయి ఫలితాలు అందుకోలేకపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మంధాన, మిథాలీపై మాత్రమే నమ్మకం ఉంచే పరిస్థితి ఉంది. బౌలింగ్‌లో పేసర్లు జులన్, వస్త్రాకర్‌తో పాటు స్పిన్నర్ గైక్వాడ్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నిలకడగా రాణిస్తున్నారు. అయితే, రౌండ్ రాబిన్ పద్ధతిలోజరుగుతున్న ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్ ఫలితం ముఖ్యమే. కాబట్టి ఒకరిద్దరు కాకుండా మిథాలీసేన జట్టుగా బాగా ఆడితేనే కప్పు ఆశించొచ్చు. గత మూడు వర్డల్ కప్స్ (రెండు టీ20 సహా)లో రెండుసార్లు ఫైనల్లో ఓడిన నేపథ్యంలో ఈసారి ప్లేయర్ల వెంట మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ కూడా ఉన్నారు. మరి, మనోళ్లు కప్పుతో తిరిగొస్తారో లేదో చూడాలి.
ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్
మార్చి 6 ఇండియా x పాకిస్తాన్
10 ఇండియా x న్యూజిలాండ్
12 ఇండియా x వెస్టిండీస్
16 ఇండియా x ఇంగ్లండ్
19 ఇండియా x ఆస్ట్రేలియా
22 ఇండియా x బంగ్లాదేశ్
27 ఇండియా x సౌతాఫ్రికా
అన్ని మ్యాచ్‌లు ఉ. 6.30 నుంచి

