కామన్వెల్త్‌లో భారత్ దుమ్మురేపింది.. బాక్సింగ్‌లో ఇద్దరు ఫైనల్‌కు.. రిలేలోనూ ఫైనల్ బెర్త్!

కామన్వెల్త్‌లో భారత్ దుమ్మురేపింది.. బాక్సింగ్‌లో ఇద్దరు ఫైనల్‌కు.. రిలేలోనూ ఫైనల్ బెర్త్!

Commonwealth Games 2026: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. బాక్సింగ్ రింగ్‌లో భారత బాక్సర్లు ప్రీతి పవార్, అంకుష్ పంగల్ తమ విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి భారత్‌కు మరో రెండు పతకాలను ఖాయం చేశారు. మరోవైపు అథ్లెటిక్స్‌లో మిక్స్డ్ 4x400 మీటర్ల రిలే జట్టు కూడా ఫైనల్‌కు అర్హత సాధించింది.

మహిళల 54 కేజీల విభాగం.. ఫైనల్లో ప్రీతి పవార్ గెలుపు:  
కామన్వెల్త్ గేమ్స్ 2026లో ప్రీతి పవార్ మహిళల 54 కేజీల సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. జాంబియాకు చెందిన కేథరిన్ మ్వాపేపై 5–0తో తిరుగులేని విజయాన్ని సాధించింది. తొలి కొన్ని నిమిషాల్లో ఇద్దరు బాక్సర్లు పోటీపడి పంచ్‌లు విసిరినప్పటికీ, ఆ తర్వాత ప్రీతి పూర్తిగా మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఐదుగురు జడ్జిలు రౌండ్ల ఆధారంగా 30–25, 30–25, 30–26, 30–24, 30–25 పాయింట్లతో ప్రీతికే విజయాన్ని కట్టబెట్టారు. ఇక స్వర్ణ పతకం కోసం ఫైనల్ సమరంలో కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో ప్రీతి తలపడనుంది.

పురుషుల 80 కేజీల విభాగం.. ఫైనల్‌కు అంకుష్ పంగల్: 
పురుషుల 80 కేజీల సెమీఫైనల్లో భారత బాక్సర్ అంకుష్ పంగల్ మెరుపు పంచ్‌లతో ప్రత్యర్థి జోషువా ఒఫోరీని చిత్తు చేశాడు. జోషువాపై 5–0తో ఏకగ్రీవ నిర్ణయంతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో అంకుష్‌కి ఇది వరుసగా విజయం కావడం విశేషం. ప్రారంభం నుంచే పంపింగ్ పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడిన అంకుష్‌కు నలుగురు జడ్జిలు 30–26, ఐదో జడ్జి 29–27 పాయింట్లు కేటాయించారు.

అథ్లెటిక్స్: మిక్స్డ్ 4x400m రిలే ఫైనల్లో భారత్: 
అథ్లెటిక్స్ విభాగంలో భారత మిక్స్డ్ 4x400 మీటర్ల రిలే జట్టు తమ టైమింగ్‌ ఆధారంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. హీట్ 2 విభాగంలో భారత బృందం రేసును 3:20.98 సెకన్లలో పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది.

ప్లేయర్ల స్ప్లిట్ టైమింగ్స్:
మొదటి లెగ్‌ను విశాల్ తెన్నరసు కయల్విళి 46.10 సెకన్లలో ముగించి రెండో స్థానంలో బ్యాటన్‌ అందించాడు. రెండో లెగ్‌ను అన్సా బాబు 53.90 సెకన్లలో పూర్తి చేసింది.. మూడో లెగ్‌లో రాజేష్ రమేష్ 47.00 సెకన్ల మెరుపు ప్రదర్శనతో భారత్‌ను రేసులో నిలిపాడు. చివరి లెగ్‌ను రష్‌దీప్ కౌర్ 53.98 సెకన్లలో ముగించడంతో భారత్ సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది.