కాంటాక్ట్​ అయినోళ్లు అందరికీ టెస్టు చేయక్కర్లే

కాంటాక్ట్​ అయినోళ్లు అందరికీ టెస్టు చేయక్కర్లే
  • హై రిస్క్​ ఉన్నోళ్లకే పరీక్షలు క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్
  • కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్నోళ్ల సంఖ్య ఇప్పుడు తక్కువే
  • రాబోయే రోజుల్లో మాత్రం వేగంగా పెరగొచ్చు
  • ఒమిక్రాన్, డెల్టా వల్లే కేసులు పెరుగుతున్నయ్  
  • రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ హెచ్చరిక 

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్లతో కాంటాక్ట్ అయిన వ్యక్తులకు హెల్త్ పరంగా హై రిస్క్ ఉంటే తప్ప టెస్టులు చేయాల్సిన అవసరంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తెలిపింది. అసింప్టమాటిక్​గా ఉండి, హోం ఐసోలేషన్ పూర్తి చేసుకున్న వ్యక్తులను డిశ్చార్జ్ అయినట్లుగానే భావించాలని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ట్రావెల్ చేసిన వ్యక్తులకూ టెస్టులు అక్కర్లేదని చెప్పింది. కరోనా టెస్టు చేసుకోలేదన్న కారణంతో సర్జరీలు, డెలివరీల వంటి ఎమర్జెన్సీ ప్రొసీజర్లను తిరస్కరించరాదని స్పష్టం చేసింది. టెస్టింగ్ ఫెసిలిటీ లేదన్న కారణంతో పేషెంట్లను ఇతర దవాఖాన్లకు రిఫర్ చేయరాదని తెలిపింది. కరోనా పేషెంట్లకు ఎమర్జెన్సీ ఆపరేషన్ లేదా ప్రెగ్నెంట్లకు డెలివరీ చేయాల్సి వస్తే సింప్టమ్స్ ఉంటే తప్ప టెస్టు చేయాల్సిన అవసరంలేదని వివరించింది. 

5-10% మందే ఆస్పత్రిలో చేరుతున్నరు
దేశవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వాళ్లలో 5 నుంచి 10% మంది మాత్రమే దవాఖాన్లలో చేరుతున్నారని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. అయితే, దేశంలో థర్డ్ వేవ్​ కొనసాగుతుండడం, కేసులు పెరుగుతుండడంతో మున్ముందు పరిస్థితి చాలా స్పీడ్ గా మారిపోవచ్చని హెచ్చరించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో సుమారు 20 నుంచి 30% మంది ఆస్పత్రులపాలయ్యారని కేంద్రం తెలిపింది. పది రోజుల కిందట రోజూ 10, 15 వేల కేసులు నమోదు కాగా, ఇప్పుడు 1.79 లక్షలకు చేరాయని, డైలీ పాజిటివిటీ రేటు 13.29కి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల కారణంగానే కేసులు పెరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నట్లు పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, యూటీలు ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. కొవిడ్ కేర్ సెంటర్లను అవసరమైతే ఆక్సిజన్ బెడ్లుగా మార్చేఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది. జూనియర్ డాక్టర్లు, ఎంబీబీఎస్ స్టూడెంట్ల సేవలనూ వాడుకుని, తగినంత స్టాఫ్ ​ఉండేలా చూసుకోవాలని పేర్కొంది.