జీనోమ్ సీక్వెన్సింగ్ చేయకుండానే ఒమిక్రాన్ టెస్ట్

జీనోమ్ సీక్వెన్సింగ్ చేయకుండానే ఒమిక్రాన్ టెస్ట్

ప్రపంచాన్ని కొత్త వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. బాధితులు ఈ వైరస్ బారినపడ్డారో లేదో తెలుసుకోవాలంటే రెండు నుంచి ఐదు రోజుల సమయం పట్టేది. కానీ, ఇప్పుడు కేవలం రెండు గంటల్లోనే ఈ వైరస్ రిజల్ట్ తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఓ కిట్‌ను  ఐసీఎంఆర్ రూపొందించింది. దిబ్రూగర్ లోని ఆర్ఎమ్ఆర్సీ (రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్) సీనియర్ సైంటిస్ట్, డాక్టర్ బిశ్వజ్యోతి బోర్కకోటి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఐసీఎంఆర్ అధ్వర్యంలో ఈ టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది. ‘ఈ కిట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రస్తుతానికి టార్గెటెడ్ సీక్వెన్సింగ్ కోసం కనీసం 36 గంటలు మరియు వేరియంట్‌ను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ కిట్ తో కేవలం రెండు గంటల్లోనే వైరస్ ను గుర్తించవచ్చు. ఇది 100 శాతం కచ్చితమైన రిజల్ట్ ను అందిస్తోంది’ అని బిశ్వజ్యోతి చెప్పారు. 

బిశ్వజ్యోతి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గతేడాది జూలైలో కోవిడ్ వైరస్‌ను విజయవంతంగా వేరుచేసింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఈ కిట్ రూపొందించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.