దురాశకు, అత్యాశకు పోతే, నిరాశే మిగులుతుంది

దురాశకు, అత్యాశకు పోతే, నిరాశే మిగులుతుంది

ఒక ఊళ్లో సోమయ్య అనే దిగువ మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడు. అతడికి ఎలాగైనా ధనవంతుడు కావాలనే కోరిక ఉండేది. తన కోరిక నెరవేర్చుకోవటం కోసం, ఒకసారి ఆ దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరకు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ పెరట్లో కాసిన పెద్ద గుమ్మడికాయను తీసుకెళ్లి, రాజుకు బహుమతిగా ఇచ్చాడు. 

అంత పెద్ద గుమ్మడికాయను చూసి రాజు సంతోషించి, ‘సోమయ్యా! నీకేం కావాలి?’ అని అడిగాడు. 

‘ప్రభూ! నాకు భూమి కావాలి’ అన్నాడు. 

‘ఎంత భూమి కావాలో కోరుకో’ అన్నాడు రాజు. 

‘ మహాప్రభూ. నేను సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంత దూరం పరిగెడితే అంత భూమి నాకు ఇవ్వాలి’ అన్నాడు సోమయ్య. ‘సరే! నువ్వు ఎంత దూరం వెళ్లి, వెనక్కి వస్తావో అంత భూమి ఇస్తా’ అన్నాడు రాజు.

మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే సోమయ్య పరుగు మొదలుపెట్టాడు. సాయంకాలం వరకు పరుగెత్తి... బాగా అలసిపోయి, ఇక పరుగు తీయలేక తిరుగు ప్రయాణమై, ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తరువాత కాసేపటికే మరణించాడు. ఆరడుగులు నేలలో తన జీవితం ముగించాడు.

మానవులకు ఆశ ఉండొచ్చు కాని అత్యాశ, దురాశ ఉంటే చివరకు దుఃఖమే మిగులుతుందని చెప్పటానికి ఈ కథ బాగా ప్రచారంలో ఉంది. తన శక్తి ఉన్నంతవరకు పరుగెత్తి ఉంటే, కనీసం కొన్ని ఎకరాల భూమి దక్కేది సోమయ్యకు. కానీ, అత్యాశకు పోయి తన మరణాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. ఏమీ అనుభవించలేకపోయాడు. 
*   *   *
మహాభారతంలో ఇటువంటి సంఘటనకు సంబంధించిన సందర్భం ఒకటి ఉంది. కౌరవులకు, పాండవులకు జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు, ధర్మం ప్రకారం పన్నెండేండ్లు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేశారు. తిరిగొచ్చాక, తమ రాజ్యం తమకు అప్పచెప్పమని ధర్మరాజు కోరాడు. ధర్మరాజు మాటలకు పగలబడి నవ్వుతూ, వాడి సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని దుర్యోధనుడు మొండిగా పలికాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వమని అడిగినప్పటికీ, దుర్యోధనుడు అంగీకరించలేదు. ఫలితంగా కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. కౌరవులంతా మరణించారు. రాజ్యం పాండవులకు సంక్రమించింది. కౌరవులు ఏమీ అనుభవించలేకపోయారు. దురాశ ఫలితమే ఇది.
*   *   *
పంచతంత్రంలో... ఒక బోయవాడు ఆహారం కోసం వేటాడుతున్నాడు. అదే సమయంలో ఒక నక్క లేడిని చంపి, తిందామని పక్కన పెట్టుకుంది. అది చూసిన వేటగాడు నక్కను వేటాడబోయాడు. అంతలోనే పాము కరిచి వేటగాడు మరణించాడు. వేటగాడి కింద పడి పాము కూడా మరణించింది. ఈ రోజు తన అదృష్టం బాగుంది కనుక, వేటగాడితో పాటు ఇన్ని జంతువులు దొరికాయనుకుంటూ సంతోషపడింది నక్క. ముందుగా దేని మాంసం తినాలా అని ఆలోచించి, అన్నిటికంటె ముందు బోయవాడి చేతిలోని బాణానికి కట్టిన వింటి నారి తినాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆ నారిని కొరికింది. నారి తెగి బాణం వచ్చి, నక్క కడుపులో గుచ్చుకుంది. దానితో నక్క చచ్చిపోయింది. కేవలం చనిపోయిన లేడిని మాత్రమే ఆహారంగా తిని ఉంటే నక్క చచ్చిపోయేది కాదు. అత్యాశ కారణంగా మొదటికే మోసం వచ్చింది.
*   *   *
ఒక కాకికి ఒకసారి మాంసం ముక్క ఒకటి దొరికింది. అది నోట కరచుకుని, చెట్టు మీద కూర్చుంది. అది దూరం నుంచి చూసిన నక్క, మాంసం ముక్క ఎలాగైనా తినాలని ‘కాకి బావా! నువ్వు చాలా బాగా పాడతావట కదా! ఒక మంచి పాట పాడు. నీకు నేను ఇంకా రెండు మాంసం ముక్కలు ఇస్తా’ అని తియ్యగా పలికింది. అత్యాశకు పోయిన కాకి, నిజంగానే తాను చాలా బాగా పాడతాను అనుకుని, వెంటనే, ‘కావ్, కావ్‌‌’ అంది. నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోయింది. ఆ మాంసాన్ని తన నోట కరుచుకుని పరుగులు తీసింది నక్క. ‘అత్యాశకు పోయి, అందిన ఆహారాన్ని వదులుకున్నా’ అనుకుంది కాకి. 

మానవులకైనా, జంతువులకైనా.. ఏ ప్రాణికైనా తృప్తి ఉండాలి. ఉన్నదానితో హాయిగా జీవించటం అలవరచుకోవాలి. ప్రస్తుత సమాజంలో అందని ద్రాక్ష కోసం అర్రులు చాపుతున్నవారి సంఖ్య పెరిగిపోయింది. అనవసరమైన విషయాలలో పోటీ పడుతూ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ముందు తరాల వారి కోసం సంపాదిస్తున్నామంటూ (తరాలు మిగలట్లేదు), వాళ్లు మాత్రం అనుభవించలేకపోతున్నారు. దురాశకు, అత్యాశకు పోతే, నిరాశ మిగులుతుందనడానికి ఇన్ని కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి. 

-  డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232