ఇవాళ వడగాలులు..ఏప్రిల్ 27 నుంచి 4 రోజుల పాటు వర్షాలు

ఇవాళ వడగాలులు..ఏప్రిల్ 27 నుంచి 4 రోజుల పాటు వర్షాలు
  • వడగాలులు.. వానలు!..రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్ నమోదు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎండలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. టెంపరేచర్లు 45 డిగ్రీల మార్క్​ను టచ్ అయ్యాయి. అయితే, రాబోయే ఐదు రోజులు మాత్రం భిన్నమైన వాతావరణ పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ చెప్తున్నది. ఓ వైపు వడగాలులు వీస్తాయని, మరోవైపు వానలూ పడ్తాయని హెచ్చరించింది. గురువారం విడుదల చేసిన బులెటిన్​లో ఐదు రోజులు వడగాలులు వీస్తాయని తెలిపిన వాతావరణ శాఖ.. శనివారం నుంచి నాలుగు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్​కర్నూల్

వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు శుక్రవారం వడగాలుల హెచ్చరిక చేసిన వాతావరణ శాఖ.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం నుంచి మంగళవారం వరకు ఆయా జిల్లాలతో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోనూ వడగాలులు వీస్తాయని తెలిపింది. దాంతో పాటు ఆయా జిల్లాలు సహా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

11 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో మరోసారి టెంపరేచర్లు 45 డిగ్రీల మార్క్​ను చేరాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 44.9, మహబూబాబాద్​ జిల్లాలో 44.8, సూర్యాపేట జిల్లా మునగాలలో 44.7, జయశంకర్ భూపాలపల్లిలో 44.6, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో 44.5, వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో 44.4, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో 44.3, జగిత్యాలలో 44.2, వరంగల్, పెద్దపల్లిలో 44.1 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. 11 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి.