ఒకప్పుడు పాటంటే ప్రజల ఆయుధం. నోరులేని వారి తరుఫున గొంతెత్తే చైతన్య దీపిక. పాలకులను ప్రశ్నించే నిప్పుల జమిడిక. అన్నదాతలు దుఃఖాన్ని, పేదల కన్నీళ్లను, నేలరాలిన అమరవీరుల ఆశయాల్ని పాటల్లోకి ఒంపేవారు రచయితలు. ఈ రకమైన మంచి పాటలు ఈ దశాబ్ద కాలంలో చాలా తక్కువగా వచ్చాయి. అలరించే పాటల ఉధృతికి, ఆలోచింపజేసే పాట నిలబడలేకపోతున్నది.
రచయితలు కూడా క్రమంగా ఎంటర్టైన్మెంట్ పాటలకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కాలం ఆ దిశగా పయనించడం ఒక కారణం. సామాజికంగా బలమైన ప్రజా ఉద్యమాలు లేకపోవడం మరో కారణం. ఈ నేపథ్యంలో ఈ దశాబ్దికాలంలో మంచి పాటలు ఏమొచ్చాయో చెప్పుమని, ఏ సాంస్కృతిక కార్యకర్తను, నాయకుడిని అడిగినా తలగోక్కునే దుస్థితి నెలకొన్నది.
ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానంతరం ఈ రకమైన ప్రజాపోరాట పాటకు పెద్ద విరామం ఏర్పడింది. పాలకులను నిలదీసిన పాటల స్థానంలో, సంక్షేమ పథకాల ప్రచార హోరు పాటలు పెరిగాయి. అందుకే ఇప్పుడు ప్రజా విముక్తి పాటలు వేళ్ల మీదికే పరిమితం అయ్యాయి.
తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ పాలనను నిరసిస్తూ గద్దర్ ‘‘సాల్ దొర నీ పాలన–సల్లంగ బతుకుదొర” అంటూ పాట అల్లాడు. అలాగే ‘‘బానిసలారా లెండిరా... ఈ బాంచన్ బతుకులు వద్దురా/అడక్కుంటే మన ఆకలి తీరదు/గుద్ది గుంజుకుందామోరో’’అంటూ బహుజనులకు ఒక పిలుపును ఇచ్చాడు. ఇక రోజు రోజుకు పెరిగిపోతున్న కార్పొరేట్ దోపిడీ మీద గోరటి వెంకన్న ‘‘అద్దాల అంగడి మాయరా/దాని చూపుకు నరుడి బతుకు బొంగరమై పోయెరో’’అంటూ పాట రాశాడు. ఈ పాట ఆధునిక సామ్రాజ్యవాదం గుత్తా పెట్టుబడిదారి ధోరణితో ఎట్లా ప్రజలను దోచుకుంటున్నదో వివరించింది. ఇది ఇప్పటిదాకా దోపిడీని వివరించిన కమ్యూనిస్ట్ తరహా పాటలకు భిన్నమైనది. దోపిడీని చాలా సింపుల్‌గా వెంకన్న ఇందులో కండ్లకు కట్టాడు.
నూతన రాష్ర్టంలో పాలకుల పద్ధతి మీద మొదటి గంట మోగించిన వాగ్గేయకారుడు ఏపూరి సోమన్న. ‘‘ఓ కేసీఆరు సారు మా కొత్త సీఎం గారు/ మా వాడకు మళ్లొచ్చిపోతరా దొరగారు మీరు...” అంటూ అప్పటి కొత్త సీఎం మీద చమక్కులు విసిరాడు. దీంతో ఆయనకు సర్కార్ నుంచి నోటీసులు సైతం వచ్చాయి. అయినా సరే ఆగని ఏపూరి మరిన్ని పదునైన పాటలు రాశాడు. ‘‘ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణ” అంటూ విరుచుకుపడ్డాడు. అంతేకాదు ‘‘బహుజనా మన బతుకెన్నడు మారురో...’’అంటూ బహుజనులను ఆలోచనలో పడేసే పాట రాశాడు.
ప్రతి పోరాట సందర్భంలో పాటై ప్రవహించే రచయిత మిత్ర. ఆయన పాలకుల ప్రతి తిరోగమన విధానం మీద పాట రాశాడు. ముఖ్యంగా ఈ పదేళ్లలో పలు ప్రజా సమస్యలపై పదునైన పాటలు రాశాడు. దామగుండం అటవీ సమస్యపై పాట రాసి నిరసించాడు. అలాగే ప్రజల కోసం ప్రాణమిచ్చే అమరుల మీద ‘‘ఎవరో ఒకరు...” అంటూ పాట రాశాడు.
ఇక ప్రజాకళామండలి అమరుడు ప్రభాకర్, జీఎన్ సాయిబాబల అమరత్వం మీద కూడా మంచి పాటలు రాశాడు మిత్ర. సీనియర్ వాగ్గేయకారుడు మాస్టార్జీ దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మతోన్మాద ప్రభావం మీద పాటలు రాశాడు. చాలా పరిమితంగానైనా మంచి పాటలు రాశాడు.
‘‘భారత రాజ్యాంగాన్ని రాయచేతగానోళ్లు/రాసిన అంబేద్కర్‌ను ద్వేషించే నీచులు/నీచులు తెగ మ్లేచులు/నిభ్ర ఆసానిలు”అని మనువాదుల దుర్మార్గాన్ని ఖరాఖండిగా ఎండగట్టాడు. ఇక మిట్టపల్లి సురేందర్ తెలంగాణ ఉద్యమంలోనే పాటను సోషల్ మీడియాలో ఉర్రూతలూపడంలో ట్రెండ్ సెట్టర్‌గా మారాడు. టీవీ చానెళ్ల కేంద్రంగా పాటను ప్రసారం చేసి, లక్షలాదిమందిని చేరువచేసే మార్గం వేశాడు. ఇది ఆ తరువాత అనేకమందికి మార్గదర్శకం అయ్యింది.
తెలంగాణ అనంతరం కూడా పదునైన పాటలు రాశాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు రైతు నల్లచట్టాలు తెచ్చినప్పుడు కూడా మిట్టపల్లి మంచి పాటను రాశాడు. ‘‘నాగలి కళ్లలో కన్నీరెందుకో.../ అందరి ఆకలి తీర్చినందుకా...?!”అంటూ కవితాత్మకంగా రైతు గోసను కళ్లకు కట్టాడు.
సీనియర్ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ‘‘బోధి నీడలో కొలువైన ఓ ముని/వీధి వీధిలో నీ వెలుగే ఆమని” అంటూ కొత్త సచివాలయం వెనకాల 125అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిన సందర్భంలో రాశాడు. ఇక బహుజన భావజాలం పరంగా పదునైన పాటలు రాస్తున్న వాగ్గేయకారుడు మచ్చ దేవేందర్. ‘‘ఏమై పోయేవాళ్లమో అంబేద్కరు లేకుంటే” అంటూ రాసిన పాట తెలంగాణ అనంతర అంబేద్కర్ ఉద్యమానికి దిక్సూచిగా మారింది. అలాగే ఇదే ఐడియాలజీలో తాను మరిన్ని మంచి పాటలు రాశాడు. ‘‘వినుడి వినుడి దేవుళ్ల కథ” అంటూ మూలవాసీ చరిత్రను ఒక మాస్టార్జీ దారిలో తవ్వేపని చేశాడు.
ఇక యువ వాగ్గేయకారుడిగా మానుకోట ప్రసాద్ సైతం అంబేద్కర్ ఉద్యమానికి తోడ్పాటునందించే మంచి పాటలు రాశాడు. ‘‘ఇది బొమ్మ కాదురా నా చిట్టికన్నా నిలువెత్తు త్యాగమై వెలసింది” అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ త్యాగాన్ని ఎలుగెత్తి చాటాడు. అలాగే ‘‘మాదెందుకు మాకు కాదు ఆ నినాదం, అని అవగాహన లేకున్నది కొంత సమాజం” అంటూ మరో మంచిపాటను కూడా రాశాడు.
ఈ నేపథ్యంలోనే 1994లో ప్రభంజనం సృష్టించిన బహుజన ఉద్యమానికి ఈ పదేళ్లలో ఒక కదలిక వచ్చింది. ఈ సందర్భంగా పాటమ్మ రాంబాబు రాసిన పాటలు ఎంతగానో ఉద్యమ భావజాలాన్ని రగిలించాయి. ఆనాడు మాస్టార్జీ, ఇవాళ రాంబాబు అనేటంతగా జనాన్ని చేరాయి. ‘‘అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే” అంటూ అద్భుతమైన పాటను అందించాడు.
ఈ పాట పార్టీలకు అతీతంగా బహుజనులు ఓన్ చేసుకున్నారు. అలాగే తల్లి సావిత్రి త్యాగం మీద సైతం రాంబాబు మంచి పాటను రాశాడు. ‘‘అణగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దైపొడిసెను చదువుల జెండగా మారి” అంటూ సావిత్రిబాయి పూలే త్యాగాన్ని పాటకెత్తాడు. ఇక గిద్దె రాంనర్సయ్య బలమైన గొంతు కలిగిన గాయకుడు. తెలంగాణ ఉద్యమకాలం నుండి పలు మంచి పాటలు రాశాడు. అందులో భాగంగా తెలంగాణ వచ్చిన తరువాత ఈ పదేళ్లలో రాంనర్సయ్య ఒకటి రెండు మంచి పాటలు రాశాడు.
ప్రజా సాంస్కృతిక రంగంలో విలువైన కృషి చేసిన పాట కవులకు, కళాకారులకు నివాళులు అర్పిస్తూ ‘‘పల్లె యాదికొచ్చినా.. మల్ల పాట మొదలుపెట్టిన” అంటూ ఆనాటి కళాకారులు, వాగ్గేయకారులను గుర్తు చేసుకున్నాడు. అలాగే కాన్షీరాం త్యాగం మీద సైతం రాంనర్సయ్య ఒక పాటను రాశాడు. ఇక ఇదే దారిలో సుక్క రాంనర్సయ్య ఫైర్ బ్రాండ్‌గా వెలుగులోకి వచ్చాడు.
పాటను అమ్ముకుంటున్న వాళ్లను, కాడి కిందేసిన వాగ్గేయకారులను దృష్టిలో పెట్టుకుని ‘‘ప్రశ్నించే తత్వాన్ని సంపుకుని పాటమ్మా ఊరేగుతున్నవ్–దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడుక్కతింటున్నవ్” అంటూ పాట పతనాన్ని, రచయితల దుర్మార్గాన్ని ఏకకాలంలో ఎండగట్టాడు.
ఈ దశాబ్ద కాలంలో సీనియర్ రచయిత మిత్ర ప్రతి సామాజిక సందర్భానికి, ప్రతి రాజకీయ పరిణామానికి తన కలాన్ని ఝుళిపిస్తూ అనేక పాటలు రాశాడు. ఇదే కాలంలో మోటివేషన్ను అందించే పాటలు కూడా కొన్ని వెలువడ్డాయి. ఇక చరణ్ అర్జున్ పద్మశాలీల చితికిపోయిన బతుకు గోసను ‘‘రంగు రంగుల బట్టల నేసే నేతన్న” అని చేనేత కార్మికులకు ఒక భరోసాను ఇచ్చాడు. అలాగే తన తండ్రి మేస్ర్తీ వృత్తి బతుకును కథాగానం చేశాడు. అన్నదమ్ముల అనుబంధం, తండ్రి పాత్ర మీద హృద్యమైన పాటలు రాశాడు.
సంక్లిష్టంగా మారిన సమాజంలో అనివార్య పోటీ ఏర్పడింది. గెలుపుకు అర్థాలు మారాయి. దీంతో ఆ ఊచకోత పోటీలో నెగ్గలేక సతికిల పడే వారికోసం మోటివేషన్ను కూడా పాటల ద్వారా అందించారు కొద్దిమంది రచయితలు. ముఖ్యంగా మానుకోట ప్రసాద్ ‘‘కాలం నీతో నడువదు.. నిన్నడిగి ముందుకు సాగదు” అంటూ యూత్‌ను ఆకట్టుకునే పాట రాశాడు.
చింతల యాదగిరి, చరణ్ అర్జున్, పాటమ్మ రాంబాబులు మరికొన్ని మోటివేషనల్ పాటలు రాశారు. అలాగే స్వేరో నెట్వర్క్ నుంచి ఈ పదేళ్లలో పదుల సంఖ్యలో పాటలు వచ్చాయి. ఆ పాటలు మహనీయుల ఐడియాలజీని ప్రచారం చేయడంతో పాటు అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం వంటి రంగాల్లో బహుజనులు సాధికారతను సాధించాలని చర్చించాయి.
ఆ పాటలను డా. పసునూరి రవీందర్, ఏపూరి సోమన్న, పాటమ్మ రాంబాబు, మానుకోట ప్రసాద్, డా. జిలుకర శ్రీనివాస్ తదితరులు రాశారు. ఆ తరువాత ప్రజా సమస్యల మీద ప్రజానాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సంస్థ అప్పుడప్పుడు కొన్ని పాటలను అందించాయి.
ఉద్యమాల్లో కనుమూసిన ఇటీవలి అమరుల మీద యోచన పదునైన పాటలు రాశాడు. ఈ దశాబ్దంలో అత్యంత ఎక్కువగా అమరుల పాటలు రాసిన ఘనత ఆయనకే దక్కుతుంది. తన గొంతుతో ప్రజా ఉద్యమాలను వెలిగించిన సీనియర్ కళాకారుడు అరుణోదయ రామారావు చనిపోయినప్పుడు కూడా గొప్ప పాటను రాశాడు యోచన. ‘‘నువ్వు గొంతెత్తితే... గోదావరి లోయ లోయంత ఊగింది ఉయ్యాల/ నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనమయ్యింది ఆ వేళ” అంటూ అరుణోదయ రామారావుకు గుండెల నిండా నివాళులు అర్పించాడు. అరుణోదయ నాగన్న గొంతులో ఈ పాట ఒక శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నది. అలాగే అమరుడు లింగన్న మీద సైతం యోచన ఆలోచింపజేసే పాట రాశాడు.
ఇట్లా సామాజిక సమస్యల మీద యశ్పాల్, బుర్ర సతీష్, అభినయ శ్రీనివాస్, అంబటి వెంకన్న, కోదారి శ్రీనివాస్, మురళీ మధు, కొమిరె వెంకన్న (సాకీ), మాట్ల తిరుపతి, పల్లె నర్సింహ, దరువు అంజన్న, నేర్నాల కిషోర్, బాబ్జీ, ఎర్ర జెండా ఔన్నత్యం మీద ఆనందాచారి, మత మౌఢ్యం మీద సీనియర్ వాగ్గేయకారుడు మాస్టార్జీ, మిత్ర, నందిని సిధారెడ్డి, సురేష్ మహాజన, సంజీవ, ఎర్ర సూర్యం, రెంజర్ల రాజేష్, గోరటి రమేష్, పత్తిపల్లి తిరుపతి, చింతల యాదగిరి, చంద్రశేఖర్ ఆజాద్, పులుకుర్తి రాజేందర్, నలిగంటి శరత్, గుడిపల్లి రవి, ఆయుధాల సునీల్ తదితరులు ఈ పరంపరను కొనసాగించారు.
- డా.పసునూరి రవీందర్..కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత-
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
