- మేడ్చల్- ముత్కేడ్ రూట్‌లో తీరనున్న రైల్వే ఇబ్బందులు
- ప్రస్తుతమున్న సింగిల్ ట్రాక్‌తో అవస్థలు
- డబ్లింగ్ పూర్తయితే మహారాష్ట్రతో పెరగనున్న కనెక్టివిటీ
మెదక్, మనోహరాబాద్, వెలుగు: మేడ్చల్– ముత్కేడ్ రూట్‌లో రైల్వే డబ్లింగ్ పనులు షురూ కాగా.. స్పీడ్‌గా సాగుతున్నాయి. డబుల్ లైన్ పనులు పూర్తయితే ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు తొలగిపోనున్నాయి. సికింద్రాబాద్ నుంచి మెదక్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని ముత్కేడ్ వరకు 247 కిలో మీటర్లు ఉండగా.. ఈ రూట్లో ప్రస్తుతం సింగిల్ ట్రాక్ ఉంది. హైదరాబాద్–- జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, అజంతా ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్, దేవగిరి ఎక్స్ ప్రెస్, కాచిగూడ–పూర్ణ ఎక్స్ ప్రెస్, వంటి పలు రైళ్లు ఈ రూట్లో నడుసత్ఆయి. సికింద్రాబాద్, మేడ్చల్, నిజామాబాద్, నాందేడ్, ముత్కేడ్, నాగర్ సోల్, మన్మాడ్, ముంబాయి, అజ్మీర్ తదితర ప్రాంతాలకు ప్రతి రోజు 40 వరకు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
సింగిల్ ట్రాక్ తో ఇబ్బందులు
సింగిల్ ట్రాక్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గూడ్స్ రైళ్లు వచ్చినపుడు ప్యాసింజర్ రైళ్లను ఆయా స్టేషన్లలో అరగంట పాటు ఆపేయాల్సి వస్తుంది. వడియారం స్టేషన్‌లో ఒక్కోసారి మూడు రైళ్లు క్రాసింగ్ కోసం నిలిపివేస్తుంటారు. దీనివల్ల ప్రయాణికులు సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నారు. దీనివల్ల ప్రయాణీకులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ రూట్‌ను డబుల్ లైన్ (డబ్లింగ్) చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈక్రమంలో మేడ్చల్– ముత్కేడ్ రూట్‌తోపాటు, మహబూబ్‌నగర్– డోన్ రూట్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనుల కోసం 2023లో రూ.5,655 కోట్లు మంజూరయ్యాయి. దీనిలో 60 శాతానికి పైగా నిధులు ఈ రూట్ కోసం వెచ్చించనున్నారు.
భూసేకరణ పూర్తి
డబ్లింగ్ పనులకు గతంలోనే భూసేకరణ పూర్తయింది. మెదక్ జిల్లాలో మనోహరాబాద్ మండలం కాళ్లకల్ నుంచి రామాయంపేట మండలం అక్కన్నపేట వరకు 38 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉంది. మనోహరాబాద్, బ్రాహ్మణపల్లి, స్టేషన్ మాసాయిపేట, శ్రీనివాసనగర్, వడియారం (చేగుంట), మీర్జాపల్లి, అక్కన్నపేట, మెదక్ లో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బ్రాహ్మణపల్లి స్టేషన్ మాసాయిపేట మధ్య ప్రస్తుతం రైల్వే డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాక్ పక్కన మరో ట్రాక్ నిర్మించేందుకు ప్రొక్లెయిన్లతో భూమి చదును చేస్తున్నారు. డబ్లింగ్ పనులు పూర్తయితే రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఉండదు. ప్యాసింజర్లు, గూడ్స్ రవాణాలో జాప్యం ఉండదు. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ నుంచి మేడ్చల్ వరకు వచ్చే ఎంఎంటీ ఎస్ రైళ్లను వడియారం వరకు పొడిగించే అవకాశం
కూడా ఉంది.

