V6 News

గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన కల్వకుంట్ల కవిత 

గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన కల్వకుంట్ల కవిత 
  • పార్టీ ఏర్పాటుకు ముందు అమరవీరులకు కల్వకుంట్ల కవిత నివాళి
  • గన్ పార్క్ దగ్గర అమరు వీరులస్తూపానికి నివాళులర్పించిన కవిత  
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు 
  •  అనంతరం భారీ కాన్వాయ్ తో మునీరాబాద్ సభకు బయల్దేరిన కవిత 

హైదరాబాద్: బీఆర్​ఎస్​నుంచి తెగతెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత.. కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇవాళ మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లో రాజకీయ పార్టీని ఆమె ప్రకటించనున్నారు. ఈ క్రమంలో తొలుత గన్ పార్క్ దగ్గర అమర వీరులకు నివాళులర్పించారు కవిత. భారీ ఎత్తున తరలివచ్చిన జాగృతి కార్యకర్తలతో కలిసి గన్ పార్క్ చేరుకున్న కవిత అమర వీరుల స్తూపం దగ్గర ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కాన్వాయ్ తో  మునీరాబాద్ సభకు బయల్దేరారు. 

రాష్ట్రంలో ఇవాళ ఏప్రిల్ 25, 2026న మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. బీఆర్​ఎస్​ నుంచి తెగతెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత.. కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లోని అద్వయ కన్వెన్షన్​ సెంటర్​లో రాజకీయ పార్టీని ఆమె ప్రకటించనున్నారు. 

పార్టీ ఏర్పాటు ప్రక్రియలో కవిత అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.  పార్టీ జెండా, ఎజెండా సహా ప్రతి అంశంపై నిపుణులతో చర్చలు జరిపారు. ఉద్యమకారులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్లాలో ఇటు రాజకీయ విశ్లేషకులతోనూ సమాలోచనలు జరిపారు. పొలిటికల్  అనలిస్ట్​ ప్రశాంత్​ కిషోర్​తోనూ చర్చలు జరిపారు. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, పార్టీ ఎజెండా ఏముండాలి.. వంటి అంశాలపై పీకేతో ఆమె చర్చించారు. 

ఆ మీటింగ్​తర్వాతే జాగృతిలోనే కొన్ని టీములు వేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఫీడ్​ బ్యాక్​ తీసుకుని ఎజెండా రూపకల్పన చేశారు. బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీ ఎజెండా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ జెండాలో ‘నీలి’ రంగును ఖరారు చేశారు. టీఆర్​ఎస్​ పేరు ఖాళీగా ఉందని ఆమె చెప్పినా.. ఆ పేరు వచ్చే చాన్స్​ లేదని భావించి కొత్త పేరును ఖరారు చేసినట్టు జాగృతి వర్గాలు చెబుతున్నాయి.

 బీఆర్​ఎస్​లో అవమానాలు ఎదుర్కొని.. టికెట్లు దక్కని సీనియర్​ నేతలపై కవిత దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే బోథ్​ మాజీ ఎమ్మెల్యే రాథోడ్​ బాపూరావు జాగృతిలో చేరారు. అదే బాటలో మరిన్ని చేరికలు ఉంటాయని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీలో కొందరు సీనియర్​ నాయకులతోపాటు యువత, మహిళలకు పెద్దపీట వేస్తామని చెబుతూ వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామంటున్నారు. గాంధీజీ సర్వోదయ కాన్సెప్ట్​ ఆధారంగానే తమ పార్టీ ఎజెండా ఉంటుందని తేల్చి చెప్పారు.