టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్స్కు గుడ్ బై చెబుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటన చేశాడు. రహానే టీమిండియా తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. 212 ఐపీఎల్ మ్యా్చ్లు ఆడాడు. IPLలో ఆరు టీమ్స్ తరఫున ఆడిన రహానే.. తన ఐపీఎల్ కెరీర్లో 5 వేల 367 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్లో మొత్తం 85 మ్యాచులు ఆడిన రహానే 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలతో 5 వేల 77 పరుగులు చేశాడు.
టెస్ట్ల్లో రహానే హయ్యెస్ట్ 188. ఇక.. వన్డే కెరీర్ విషయానికొస్తే.. 90 వన్డే మ్యాచులు ఆడిన రహానే 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలతో 2 వేల 962 పరుగులు చేశాడు. టీ20ల్లో కేవలం 20 మ్యాచులు ఆడిన రహానే 375 పరుగులు మాత్రమే చేశాడు. రహానే టీమిండియా తరపున అన్ని ఫార్మాట్స్లో ఆడిన మ్యాచుల సంఖ్య 195 కాగా.. ఐపీఎల్ మ్యాచుల సంఖ్య 212.
ఇక తన రిటైర్ మెంట్ పై రహానే స్పందిస్తూ.. ప్రతిదానికీ ఒక ఆరంభం, ముగింపు ఉంటుందని.. సమయం వచ్చినప్పుడు, మనం దానిని గౌరవించి ముందుకు సాగాలని చెప్పాడు. తాను బ్యాటింగ్‌లో ఎప్పుడూ టైమింగ్‌పై ఆధారపడ్డానని, దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుని ఆడానని రహానే తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్, అన్ని ఫార్మాట్‌ల నుంచి తన రిటైర్మెంట్‌ను ప్రకటించడానికి సరైన సమయం ఇదే అని భావిస్తున్నానని చెప్పాడు.
