అస్సాంలో భారీ వర్షాలు, ముంచెత్తిన వరద... 78కి  చేరిన మృతుల సంఖ్య...

అస్సాంలో భారీ వర్షాలు, ముంచెత్తిన వరద... 78కి  చేరిన మృతుల సంఖ్య...

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అస్సాంలోని ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవగా 3 లక్షల మంది జనం జీవితం అస్తవ్యస్తమైంది. గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 78కి చేరింది.వరదల కారణంగా వేల సంఖ్యలో పశువులు గల్లంతయ్యాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, విశ్వనాథ్, కామరూప్, చరాయిదేవ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తెలిపింది అస్సాం ప్రభుత్వం. వరద ప్రభావిత జిల్లాల్లో 551 గ్రామాలు నీటమునిగాయని... మొత్తం 3 లక్షల మంది ప్రజలు ప్రబావితమయ్యారని తెలిపింది ప్రభుత్వం

వరద ప్రభావిత ప్రాంతాల్లో 71 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి.. 16వేల 500 మందికి పైగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించింది ప్రభుత్వం. 30 పంపిణీ కేంద్రాల ద్వారా 72 వేల మందికి పైగా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. 21వేల 523 హెక్టార్లలో పంట నీట మునిగిందని... 11 వేలకు పైగా పశువులు కొట్టుకుపోయాయని, 17 వేల మూగజీవాలు ప్రభావితమయ్యాయని తెలిపింది ప్రభుత్వం.చాలా చోట్ల ఇళ్ళు ,రోడ్లు, స్కూళ్ళు, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయని తెలిపింది అస్సాం ప్రభుత్వం.