న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాధనాన్ని, భూములను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలోని 500 ఎకరాల కుంభకోణంతో పాటు, కాంగ్రెస్ పాలనలో '22ఏ' నిషేధిత జాబితా పేరుతో జరుగుతున్న భూకబ్జాలపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నిష్పక్షపాత విచారణ జరపకపోతే, రాబోయే తమ ప్రభుత్వంలో రెండు పార్టీల భూదోపిడీపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి నిజాం పాలనను ఆదర్శంగా తీసుకుని అత్యంత ధనికులుగా మారాలని చూస్తున్నారని మండిపడ్డారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో భూములు కాజేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిబంధనల పేరుతో వేల కోట్లను ఆక్రమిస్తోందని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందున్న ఆస్తులు, ఇప్పటి ఆస్తుల విలువపై ఎన్నికల అఫిడవిట్ల ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.
