Srinivasa Mangapuram Review: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే

Srinivasa Mangapuram Review: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే

సూపర్ స్టార్ కృష్ణ మూడో తరం వారసుడిగా, దివంగత నటుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ‘ఆర్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం గురువారం (జూలై 30, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీనివాస మంగాపురం’ కథ ఎలా ఉంది? జయకృష్ణ తొలి సినిమాతో ఆకట్టుకున్నాడా? అజయ్ భూపతి మరో విజయాన్ని అందుకున్నాడా? ఓవర్సీస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు X (ట్విట్టర్)లో వ్యక్తం చేసిన టాక్ ఎలా ఉంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథేంటంటే:

శ్రీను (జైకృష్ణ)కు మంగ (రాషా తడానీ) అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగ, అతని నిజమైన ప్రేమను చూసి చివరకు ప్రేమలో పడుతుంది. అదే సమయంలో  బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) వారి జీవితాల్లోకి వస్తాడు. వారి ప్రేమకు అడ్డంకిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? లేదా? అనేదే మిగతా కథ. 

ఆడియన్స్ టాక్..

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి సోషల్ మీడియాలో మిక్సెడ్ టాక్ వస్తోంది. అజయ్ భూపతి అందించిన స్టోరీ, స్క్రీన్‌ప్లే రొటీన్‌గా ఉన్నాయని, ట్విస్టులు లేకపోవడంతో సినిమా ఆకట్టుకోలేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. జై కృష్ణ డైలాగ్ డెలివరీతోపాటు యాక్షన్ సీన్స్‌‌‌‌లోనూ మంచి ఇంటెన్సిటీని చూపించాడని, రాషా తడానీ  స్ర్కీన్‌‌‌‌ ప్రెజెన్స్ ఆకట్టుకుందని అంటున్నారు. ఇదే క్రమంలో జయకృష్ణ, రషా తడానీ నటన బాగున్నప్పటికీ బలహీనమైన కథనం వారి ప్రయత్నాన్ని తగ్గించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు, ఈ మూవీలోని లవ్ స్టోరీ, యాక్షన్ అంశాలు బాగా నచ్చాయని, సినిమా ఎంటర్‌టైనింగ్‌గా సాగిందని పలువురు ట్వీట్స్ పెడుతున్నారు. జయకృష్ణ తన ఫస్ట్ సినిమాతోనే మంచి నటన కనబరిచాడని, ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, వాయిస్ ఓవర్ ఆకట్టుకున్నాయని కామెంట్లు చేస్తున్నారు. డెబ్యూ హీరోగా జైకి మంచి మార్కులు పడతాయని, ఈ క్రమంలోనే సినిమా "బ్లాక్‌బస్టర్" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే, మోహన్ బాబు మరోసారి తన విలక్షణమైన నటనతో సినిమాను నిలబెట్టాడని అంటున్నారు. అయితే, ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ మాత్రమే అని కామన్ సినీ ఆడియన్స్ గుర్తించుకోవాల్సి ఉంది. సినిమా అసలు ఫలితం, ప్రేక్షకుల ఆదరణ, బాక్సాఫీస్ వసూళ్లు.. రాబోయే రోజుల్లో వచ్చేదాని బట్టి క్లారిటీ వస్తుంది. 

ఓ నెటిజన్ తన రివ్యూ షేర్ చేస్తూ.. ‘శ్రీనివాస మంగాపురం’ జయకృష్ణ ఘట్టమనేనికి మంచి కమర్షియల్ డెబ్యూ మూవీ అని అభిప్రాయపడ్డాడు. సినిమాకు 3/5 రేటింగ్ ఇస్తూ, తొలి సినిమానే అయినప్పటికీ జయకృష్ణ డ్యాన్స్, నటనను ఎంతో సహజంగా చేశాడని ప్రశంసించాడు. అలాగే దర్శకుడు అజయ్ భూపతి తనదైన శైలిలో రా అండ్ రస్టిక్ విజువల్స్, సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారని, ఆయన రచన కూడా ఆకట్టుకుందని పేర్కొన్నాడు. హీరోయిన్ రషా తడానీ కూడా తన పాత్రలో చక్కగా నటించి మెప్పించిందని కొనియాడాడు. మొత్తంగా ఈ వీకెండ్‌లో చూడదగ్గ మంచి ఎంటర్‌టైనర్‌గా 'శ్రీనివాస మంగాపురం' నిలుస్తుందని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

మరో నెటిజన్ తన రివ్యూలో రాసుకొస్తూ..‘‘ ‘శ్రీనివాస మంగాపురం’ పూర్తిగా రొటీన్, ముందే ఊహించగలిగే కథతో సాగిన సినిమా. కథ ఎక్కడైనా కొత్త మలుపు తిరుగుతుందేమో అని ఎదురు చూసినా, మొదటి నుంచి చివరి వరకు అదే పాత ఫార్ములాను అనుసరించింది. స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉండగా, అజయ్ రైటింగ్ కూడా బలహీనంగా అనిపించింది. అవసరం లేని చోట పాటలను చొప్పించడం వల్ల కథలోని లోపాలు మరింత స్పష్టంగా కనిపించాయని నెటిజన్ చెప్పుకొచ్చాడు.

అలాగే, నెటిజన్ టెక్నీకల్ టీమ్ గురించి చెబుతూ..‘‘సంగీతం మాత్రం సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కానీ సహాయ పాత్రలు, ఉపకథలు సరైన ముగింపుకు చేరకపోవడంతో సినిమా వెలితిగా, గుర్తుండిపోని అనుభూతిని కలిగించింది. మెయిన్ యాక్టర్స్ కొన్ని సన్నివేశాల్లో తమ ప్రతిభను చూపించినప్పటికీ, బలహీనమైన కథ, రచన, దర్శకత్వం కారణంగా వారి ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. మొత్తం మీద సినిమా ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఆసక్తి రేకెత్తించలేని బోరింగ్ సినిమాగా మిగిలిపోయిందని సదరు నెటిజన్ అభిప్రాయపడ్డాడు.