- వారి నిర్బంధం స్వేచ్ఛా హక్కును ఉల్లంఘిస్తోందన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుమారు 12 ఏండ్లుగా జైలులో మగ్గుతున్న ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలకు సుప్రీంకోర్టు బుధవారంబెయిల్ మంజూరు చేసింది. నిందితుల సుదీర్ఘ నిర్బంధం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుకు తీవ్ర భంగం కలిగిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.
ఢిల్లీ ప్రత్యేక సెల్ పోలీసులు 2011 నవంబర్‌లో నమోదు చేసిన ఓ టెర్రర్ కేసులో మొహమ్మద్ సకీబ్ అన్సారీ, వకార్ అజహర్ ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలుగా అనుమానిస్తూ అరెస్టు చేశారు. వీరు 2014 నుంచి కస్టడీలో ఉన్నారు. వీరికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్‌లో నిరాకరించింది. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే, ఈ కేసులో విచారణ అత్యంత మందకొడిగా సాగుతోందని, సమీప భవిష్యత్తులో అది ముగిసేలా కనిపించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే కేసులో ఇప్పటికే సహ నిందితుడు ఒకరు బెయిల్‌పై బయట ఉన్నారని కోర్టు గుర్తుచేసింది. వీరిద్దరిపై మొత్తం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. రాజస్తాన్‌కు చెందిన రెండు కేసుల్లో ఒకదానిలో 2021 మార్చిలో ట్రయల్ కోర్టు వారికి శిక్ష విధించగా, హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసింది.
