ఆప్మెల్ విస్తరణకు కార్యాచరణ..విజయవాడలో 300 కేవీ సోలార్ ప్లాంట్ ప్రారంభం

ఆప్మెల్ విస్తరణకు కార్యాచరణ..విజయవాడలో 300 కేవీ సోలార్ ప్లాంట్ ప్రారంభం
  • సింగరేణి సీఎండీ  డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి

హైదరాబాద్, వెలుగు: విజయవాడలోని సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మెల్(ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్)ను బహుముఖంగా విస్తరించే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి తెలిపారు. ఆప్మెల్ స్వర్ణోత్సవాల సందర్భంగా సంస్థలో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌‌‌‌తో పాటు కొత్తగా నిర్మించిన సీసీ, ఆర్‌‌‌‌సీసీ రోడ్లను బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని సింగరేణి భవన్ నుంచి వర్చువల్‌‌‌‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు సింగరేణితో పాటు ఆప్మెల్‌‌‌‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 

సంస్థ 50 ఏళ్ల చరిత్రలోనే తొలిసారిగా రూ.63.13 కోట్ల టర్నోవర్, రూ.23.33 కోట్ల నికర లాభాలు సాధించడం అభినందనీయమన్నారు. గతేడాది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్లాంట్‌‌‌‌ను సందర్శించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆవరణలో సీసీ, ఆర్‌‌‌‌సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. 1976 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఆప్మెల్ ఈ ఏడాది స్వర్ణోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం తయారు చేస్తున్న యంత్ర పరికరాలు, విడిభాగాలతో పాటు వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వ్యాపార విస్తరణ చర్యలు చేపడతామని చెప్పారు. 

ఏడాదికి రూ.24 లక్షల విద్యుత్​ ఖర్చు ఆదా..

ఆప్మెల్ ప్లాంట్, కాలనీ అవసరాల కోసం ఏటా సుమారు రూ.60 లక్షల విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. రూ.1.24 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు రూ.24 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని, ఐదేళ్లలో పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు. ఆప్మెల్ చైర్మన్ ఎన్‌‌‌‌వీకే శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికలను వివరించారు. సింగరేణి, కోల్ ఇండియా, ఎన్‌‌‌‌ఎండీసీ సంస్థల నుంచి వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేసినట్లు వెల్లడించారు.