V6 News

క్రికెట్ నిర్వహణను ప్రైవేట్ వ్యవహారంగా చూడలేం : హైకోర్టు

క్రికెట్ నిర్వహణను ప్రైవేట్ వ్యవహారంగా చూడలేం : హైకోర్టు
  • హెచ్‌‌‌‌సీఏపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి..హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రికెట్ నిర్వహణను కేవలం ఒక ప్రైవేటు వ్యవహారంగా చూడలేమని హైకోర్టు పేర్కొన్నది. ఇందులో ప్రజాప్రయోజనం, క్రీడాకారుల అవకాశాలు, ఆర్థిక లావాదేవీలు, జాతీయస్థాయిలో ప్రాతినిథ్యంలాంటి అంశాలు కీలకంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ)లో గత కొన్నేండ్లుగా కొనసాగుతున్న అవకతవకలు, ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం తీర్పు చెప్పారు. హెచ్‌‌‌‌సీఏలో పరిపాలన, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ కోసం సీబీ సీఐడీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

హెచ్‌‌‌‌సీఏ ఆర్థిక అవకతవకలు, పరిపాలనా లోపాలపై గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు నియమించిన పలు కమిటీలు నివేదికలు సమర్పించాయని, వాటిలో లోపాలు స్పష్టంగా వెల్లడయ్యాయని పేర్కొన్నారు.  సీబీఐ దర్యాప్తు కోరినా, అది వెంటనే ఆమోదయోగ్యం కాదని, అలాంటి సందర్భాల్లో అసాధారణ అధికారాన్ని వినియోగించాలా అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందన్నారు. సఫిల్‌‌‌‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లో హెచ్‌‌‌‌సీఏను బీసీసీఐ స్వాధీనం చేసుకోవాలని కోరిన విషయం విచారణకు వచ్చింది. అయితే ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్​సీఏ పరిపాలనను బీసీసీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. 

కమిటీకి పూర్తి అధికారం..

ఇక హెచ్​సీఏ వ్యవహారాల పర్యవేక్షణ కోసం మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్‌‌‌‌రావును ఏకసభ్య కమిటీగా నియమిస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రికెట్ లీగ్ మ్యాచ్‌‌‌‌లు, ఆటగాళ్ల ఎంపిక, కోచ్‌‌‌‌లు, సెలెక్టర్లు, సిబ్బంది నియామకం, వేతనాలు వంటి అంశాలపై ఈ కమిటీకి పూర్తి అధికారం ఉంటుందని, దర్యాప్తు పూర్తయ్యే వరకు అపెక్స్ కౌన్సిల్ ఈ కమిటీ పర్యవేక్షణలో పనిచేయాలని ఆదేశించింది. జస్టిస్ నవీన్‌‌‌‌రావు పర్యవేక్షణలో గతంలో నిర్వహించిన లీగ్ మ్యాచ్‌‌‌‌లు నిష్పక్షపాతంగా జరిగాయని, ఆయన చేసిన సిఫారసులు అమలు చేయకపోవడం వల్లే సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. 

ఆయన హయాంలో 1500కు పైగా మ్యాచ్‌‌‌‌లు జరిగి, జట్ల ప్రదర్శన మెరుగుపడిందని, రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండు టైటిళ్లు గెలుచుకుందని గుర్తించింది. సిట్ దర్యాప్తు కోసం హెచ్‌‌‌‌సీఏకు సంబంధించిన అన్ని రికార్డులు, పూర్వ కమిటీలు సమర్పించిన నివేదికలను అందజేయాలని రాష్ట్ర సంస్థలు, హెచ్‌‌‌‌సీఏ అధికారులు, ఉద్యోగులను కోర్టు ఆదేశించింది. అలాగే జస్టిస్ నవీన్‌‌‌‌రావుకు నెలకు రూ.5 లక్షల వేతనం చెల్లించాలని పేర్కొంటూ తీర్పు వెలువరించింది.