రాష్ట్రంలోని మైన్స్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, చర్చల ద్వారా పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద, సబ్ కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెండింగ్ బిల్లుల విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్ వనస్థలిపురంలో పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపుల ఒత్తిడి కారణంగా నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ బండారు శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది మార్చి 18న ఆత్మహత్య చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి ఆయనకు రూ.5.5 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవాళ ఆయన కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయనకు రావలసిన రూ.5.5 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌లోనూ మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
శ్రీనివాస్ రెడ్డి మంచి నాయకుడిగా, సమర్థవంతమైన కాంట్రాక్టర్‌గా ఎంతోమందికి ఉపాధి కల్పించారని మంత్రి కొనియాడారు. అయితే, ఆయనకు చెందిన క్రషర్ మిషన్‌కు సంబంధించిన రూ.54 కోట్ల బకాయిల చెల్లింపుల ఒత్తిడి కూడా ఆయన తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందన్నారు.
