- యుద్దంతో అమెరికాకు రోజుకు బిలియన్ డాలర్ల ఖర్చు
- ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీగా వ్యయం
- తరిగిపోయిన ఆయుధ నిల్వలు
- 1,200 పేట్రియాట్లు, 1,000 టోమాహాక్‌లు ఖతం
- రక్షణ శాఖ అంచనాలంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం
వాషింగ్టన్: ఇరాన్ పై జరిగిన యుద్ధంలో అమెరికాకు భారీగా ఖర్చు అయిందని, ఆయుధ నిల్వలు గణనీయంగా తరిగిపోయాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. ఈ యుద్ధం వల్ల రోజుకు దాదాపుగా బిలియన్ డాలర్ల మేరకు వ్యయం అయినట్టుగా అమెరికా రక్షణ శాఖ అంతర్గత అంచనాలు ఉన్నాయని తెలిపింది. ‘‘ఇరాన్ పై యుద్ధంలో అమెరికా దాదాపుగా రోజుకు బిలియన్ డాలర్ల వరకూ ఖర్చు చేసింది.
యుద్ధం 38 రోజులు కొనసాగగా.. మొత్తంగా 28 నుంచి 35 బిలియన్ డాలర్ల వరకూ ఖర్చు అయినట్టుగా తెలుస్తున్నది” అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మొదటి రెండు రోజుల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు 5.6 బిలియన్ డాలర్ల విలువైన బాంబులను ఉపయోగించినట్లు అంచనాలు ఉన్నాయని వివరించింది. అమెరికా సైన్యం 13,000 కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపింది.
అయితే యుద్ధ విమానాలు, దాడి విమానాలు, యుద్ధ ట్యాంకర్లు సాధారణంగా పెద్ద లక్ష్యాలపై అనేకసార్లు దాడులు చేస్తాయి కాబట్టి.. ఆ సంఖ్య తాము ఉపయోగించిన బాంబులు, క్షిపణుల భారీ సంఖ్యను మరుగున పరుస్తోందని అధికారులు చెప్పారని పేర్కొంది. ‘‘చైనా, రష్యా వంటి ప్రధాన ప్రత్యర్థులపై భవిష్యత్తులో ఏదైనా సైనిక చర్య కోసం వాడేందుకని దాచి ఉంచిన నిల్వల నుంచి భారీగా ఆయుధాలను అమెరికా దళాలు ఇరాన్‌పై యుద్ధానికి వాడేలా చేశాయి” అని ఆ పత్రిక వివరించింది.
అమెరికా వాడిన కీలక వెపన్స్ ఇవే..
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, అమెరికా సైన్యం దాదాపు 1,100 జాయింట్ ఎయిర్ -టు -సర్ఫేస్ స్టాండ్ ఆఫ్ మిస్సైల్ -ఎక్స్‌టెండెడ్ రేంజ్ (జాస్మర్) క్షిపణులను ప్రయోగించింది. వీటిలో ఒక్కో దాని ధర సుమారు 1.1 మిలియన్ డాలర్లు ఉంటుంది. అమెరికా సైన్యం ఇరాన్‌లో 1,000 కంటే ఎక్కువ టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను కూడా ఉపయోగించింది. ఒక్కోటి సుమారు 3.6 మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తాయి. అలాగే ఈ యుద్ధంలో 1,200 కంటే ఎక్కువ పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను కూడా ప్రయోగించింది. వీటి ధర ఒక్కోటీ 4 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
ఖండించిన వైట్ హౌస్
అమెరికా ఆయుధాల నిల్వలు తగ్గిపోయాయ న్న కథనాన్ని వైట్ హౌస్ ఖండించింది. ‘అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. స్వదేశాన్ని రక్షించుకోవడానికి, ఏ సైనిక చర్యకైనా తగినన్ని ఆయుధాలు, నిల్వలు ఉన్నాయి’ అని వైట్‌హౌస్ సెక్రటరీ చెప్పారు.

