- ప్రజా సమస్యల పరిష్కారానికి ‘స్పెషల్ క్యూఆర్ కోడ్’
- జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ వినూత్న ప్రయోగం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను మరింత వేగంగా పరిష్కరించేందుకు ప్రజాపాలన–ప్రగతి ప్రాణాళికలో భాగంగా జీహెచ్‌ఎంసీ స్పెషల్ క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నగరంలోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి, పౌర సమస్యలపై వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టారు.
840 ప్రాంతాల్లో అందుబాటులో..
శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్ల పరిధిలోని షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద దాదాపు 840 క్యూఆర్ కోడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. పౌరులు వీటిని స్కాన్ చేయడం ద్వారా తమ సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చు. ఇలా అందిన ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడం ద్వారా పాలనలో పారదర్శకత పెంచడమే తమ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
ఎంఎంసీలోనూ ఏర్పాటు..
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ‘క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. మీ అభిప్రాయం పంచుకోండి.. మార్పును మీరే చూడండి’ అనే నినాదంతో ప్రజలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నారు. యూసీడీ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా సముదాయాలు, పార్కులు, వృద్ధుల డే కేర్ కేంద్రాల వద్ద వీటిని ఏర్పాటు చేసినట్లు అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ నగరాభివృద్ధికి దిక్సూచిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

