అవసరమైతే కేసీఆర్​నూ పిలుస్తం : పినాకి చంద్రఘోష్

అవసరమైతే కేసీఆర్​నూ పిలుస్తం : పినాకి చంద్రఘోష్
  • రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తం
  • కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్
  • నేను ముఖాలు చూసి విచారణ చేయను
  • జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీస్కుంట
  • సెకండ్ విజిట్​లో మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్తానని వెల్లడి
  • బీఆర్కే భవన్​లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్​ను పిలిచి సమాచారం తీస్కుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్​లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్​లో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ ప్రారంభించారు. 

ఈ క్రమంలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్​సీ (జనరల్) అనిల్ కుమార్, ఈఎన్​సీ (ఓఅండ్​ఎం) బి.నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్​సీ శ్రీనివాస్​తో ఘోష్ సమావేశం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం తర్వాత ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై టెక్నికాలిటీస్​ను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉన్నది. విచారణకు ఎవరిని పిలుస్తాం.. ఏం అడుగుతాం అని చెప్పడం తొందరపాటు అవుతుంది.

అవసరమనుకుంటే ఎవర్నైనా పిలుస్తాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముఖాలు చూసి విచారణ చేయను. జరిగిన నష్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీస్కుంట. ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాతే విచారణకు ఎవరిని పిలవాలనే దానిపై క్లారిటీ వస్తది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం ఉన్న అందరినీ విచారణకు తప్పకుండా పిలుస్తాం. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా ఎంక్వైరీ చేస్తాం. పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇవ్వాల్సి వస్తే కూడా వెనుకాడం’’అని తేల్చి చెప్పారు. 

ఇంజినీర్లతో త్వరలోనే సమావేశం అవుత

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా నెల రోజుల పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు/సలహాలు తీస్కుంటామని జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. అయితే, వాళ్ల ఫిర్యాదులు/సూచనలకు కచ్చితంగా అఫిడవిట్​ను జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘విచారణను స్పీడప్ చేసేందుకు ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ నివేదికను వీలైనంత వేగంగా ఇవ్వాల్సిందిగా ఆదేశించాం. నేనేమీ స్వతహాగా ఇంజినీర్​ను కాదు. నాకు అందరి సహాయ సహకారాలు అవసరం. విచారణకు ఎన్​డీఎస్​ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణనలోకి తీస్కుంటాం.

నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తాం. ఇంజనీర్లతో త్వరలోనే సమావేశం అవుతాం. ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ, అధికారులతోనూ మీటింగ్ పెట్టి ప్రాజెక్టులోని సాంకేతిక అంశాలను తెలుసుకుంటాం. లీగల్ సమస్యలు తలెత్తకుండా ఎంక్వైరీ కొనసాగిస్తాం’’అని అన్నారు. విచారణలో ఏమైనా లీగల్ ఇబ్బందులొస్తే ఒక్కోసారి స్టే వచ్చే అవకాశాలుంటాయని తెలిపారు. న్యాయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా విచారణ చేస్తామన్నారు. ఇప్పుడైతే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాల్సిన అవసరం లేదనిపిస్తున్నదని తెలిపారు. సెకండ్ విజిట్​లో మేడిగడ్డకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటామన్నారు. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలియజేశారన్నారు. 

కాళేశ్వరంపై అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్​

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను ఇరిగేషన్ అధికారుల నుంచి జస్టిస్ పినాకి చంద్రఘోష్ అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్​ ప్రారంభించినప్పటి నుంచి మేడిగడ్డ బ్యారేజీ కూలి ఎన్​డీఎస్​ఏ విచారణ జరిగిన తీరు వరకు సంబంధిత అధికారుల నుంచి ఆరా తీశారు. ప్రాజెక్ట్​ను ఎప్పుడు ప్రారంభించారు? కాంట్రాక్టర్లు ఎవరు? ఎన్నేండ్లకు పూర్తి చేశారు? లోపాలు ఎప్పటి నుంచి బయటపడ్డాయి? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రాజెక్ట్​కు సంబంధించిన సమగ్ర వివరాలను ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాగా, ప్రాజెక్ట్​పై న్యాయ విచారణకు సంబంధించి గోప్యతను పాటించాల్సిందిగా అధికారులకు జస్టిస్ ఘోష్ సూచించినట్టు తెలుస్తున్నది. ఏదైనా ఉంటే డైరెక్ట్​గా విచారణపై ఏర్పాటు చేసిన నోడల్ టీంతోనే కమ్యూనికేట్ చేస్తున్నట్టు సమాచారం.

ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్​

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదులు, సలహాలను తీస్కునేందుకు రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ సలహాలు చెప్పొచ్చని గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్​లో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. ‘‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 ప్రకారం వచ్చిన అధికారాలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్​గా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ, నాణ్యత, నిర్వహణ లోపాలను వెలికితీసి బాధ్యులను గుర్తించేలా కమిషన్​ను నియమించాం.

మూడు బ్యారేజీల నిర్మాణంలోని నిధుల దుర్వినియోగంపైనా కమిషన్ విచారణ చేస్తున్నది. దీనిపై ప్రజలు కూడా తమ సలహాలు, అభిప్రాయాలు, ఫిర్యాదులు చేయొచ్చు. సాక్ష్యాధారాలు, నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో అభిప్రాయాలను సమర్పించాలి. బీఆర్కే భవన్​లోని 8వ ఫ్లోర్​లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్ వద్ద పెట్టిన స్పెషల్ బాక్సుల్లో మే 31 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేయొచ్చు. పోస్టు ద్వారా కూడా అఫిడవిట్లను బీఆర్కే (8వ ఫ్లోర్​)కు పంపించొచ్చు. అయితే, సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా నోటరీ జత చేయకుండా పంపిన ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోం’’అని నోటిఫికేషన్​లో రాహుల్ బొజ్జా పేర్కొన్నారు.