చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ (Stem Cell Therapy) ఉపయోగించి ఒక వ్యక్తిలో షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండా చక్కెర స్థాయిలను నియంత్రించడం ఈ చికిత్స ద్వారా సాధ్యమైంది.
మనం తిన్న ఆహారం అరగడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్యాంక్రియాస్ లోని 'బీటా కణాలు' ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ కణాలు సరిగ్గా పనిచేయవు. అయితే శాస్త్రవేత్తలు రోగి శరీరం నుండి స్టెమ్ సెల్స్ తీసుకుని, వాటిని ప్రయోగశాలలో కొత్త బీటా కణాలుగా మార్చారు. తరువాత ఈ కొత్త కణాలను రోగి శరీరంలోకి ప్రవేశపెట్టారు. దింతో ఈ కొత్త కణాలు రోగి రక్త సరఫరాతో కలిసిపోయి, సహజంగానే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు ఆ రోగికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి ఒక పెద్ద సమస్యగా మారింది. మన దేశంలో 2024 నాటికి సుమారు 9 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతుండగా.. 2026 చివరి నాటికి షుగర్ వ్యాధి బాధితుల సంఖ్యా 10 కోట్లకు చేరుతుందని అంచనా. ఇలాంటి చికిత్సలు అందుబాటులోకి వస్తే, ఇకపై జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం తప్పుతుంది.
ఇది శాస్త్రవేత్తలు గొప్ప విజయమే అయిన, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తిపై విజయం సాధించినంత మాత్రాన అందరికీ ఇది వెంటనే పని చేస్తుందని చెప్పలేం. అది కూడా ఇది మొదటి కేసు మాత్రమే. కానీ ఈ చికిత్స ఎంత కాలం పని చేస్తుంది ? భవిష్యత్తులో ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ? అనేది తెలియాలంటే మరిన్ని పరిశోధనలు ఇంకా పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్స్ జరగాలి. ఈ టెక్నాలజీ సామాన్యులకు అందుబాటులోకి రావడానికి, తక్కువ ధరకు దొరకడానికి మరికొంత సమయం పడుతుంది.
షుగర్ వ్యాధి అంటేనే ఇక జీవితాంతం మందులతోనే సరిపెట్టుకోవాలి అనుకునే వారికి, ఈ స్టెమ్ సెల్ థెరపీ ఒక కొత్త ఆశను పుట్టిస్తుంది. సైన్స్ రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని చెప్పొచ్చు.
