మళ్లీ చిగురిస్తోన్న స్నేహం: భారతీయులకు వీసా సేవలను పునరుద్ధరించిన బంగ్లా

మళ్లీ చిగురిస్తోన్న స్నేహం: భారతీయులకు వీసా సేవలను పునరుద్ధరించిన బంగ్లా

ఢాకా: భారత్, బంగ్లాదేశ్​మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తోంది. ఇటీవల ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గి మళ్లీ సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా సేవలను పునరుద్ధరించింది. న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో శుక్రవారం (ఫిబ్రవరి 20) నుంచి భారతీయ పౌరులకు పూర్తి వీసా సేవలు తిరిగి ప్రారంభించింది. పర్యాటక, వైద్య, వ్యాపారం, వర్క్ వీసా సేవలు ఎటువంటి పరిమితులు లేకుండా తిరిగి మొదలయ్యాయి. 

బంగ్లా మాజీ తాత్కలిక ప్రధాని మహ్మద్ యూనస్ ప్రభుత్వంలో భారత్, బంగ్లా మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య వీసా సేవలు తాత్కలికంగా నిలిచిపోయాయి. 2026, ఫిబ్రవరిలో జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‎పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ బంగ్లా ప్రధానిగా ఎన్నికయ్యారు. 

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముహమ్మద్ యూనస్ తాత్కాలిక పరిపాలనలో భారత్‎తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడంపై తారిఖ్ రెహామాన్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో భారతీయ పౌరులకు పూర్తి వీసా సేవలను పునరుద్ధరించడం ద్వారా ఇండియాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి త్వరగా చర్యలు తీసుకున్నారు. తారిఖ్ రెహమాన్ వైఖరితో భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందంటున్నారు గ్లోబల్  ఎక్స్‎పర్ట్స్.