తెలంగాణ రాష్ట్రం చేపల పెంపకంలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2022-23లో చేపల ఉత్పత్తి విలువ రూ.6,191 కోట్లకు చేరుకోవడం.. 2016-17లో రూ.2,111 కోట్ల నుంచి 193 శాతం పెరుగుదలను సూచిస్తోంది. పరిమాణంలోనూ 1,93,732 టన్నుల నుంచి 4,24,327 టన్నులకు పెరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం ఇది 119 శాతం పెరుగుదల. రాష్ట్రంలో 5.73 లక్షల చదరపు కిలోమీటర్ల నీటి వనరులు ఉండటం, దేశంలో మూడో అతిపెద్ద అంతర్గత జలాల విస్తరణగా నిలవడం ఈ విజయానికి బలమైన ఆధారం. అయితే, ఈ ‘నీలి విప్లవం’ నీడలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న అవినీతి, దళారీ వ్యవస్థ, అధికారుల వైఫల్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలంగాణలో మత్స్యకారుల జనాభా సుమారు 27.14 లక్షల మంది ఉన్నట్లు అధికారిక డేటా చూపిస్తోంది. 2014 సమగ్ర కుటుంబ సర్వేలో మత్స్యకార కుటుంబాలు 40 లక్షలుగా నమోదైనప్పటికీ, మొత్తం జనాభా 27 లక్షలకు మించి ఉండవచ్చు. కానీ, అధికారికంగా గుర్తించిన సభ్యత్వాల సంఖ్య కేవలం 3,50,168 మాత్రమే. మిగిలిన దాదాపు 23 లక్షల మంది సంక్షేమ పథకాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. సభ్యత్వం లేకుండా, ప్రమాద బీమా, సబ్సిడీలు, రుణాలు, పనిముట్లు వంటి సౌకర్యాలు అందకుండా పోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సభ్యత్వానికి రూ.10 నుంచి రూ.100 మాత్రమే ఖర్చు. కానీ, దళారులు, అధికారులు కలిసి ఒక్కొక్క సభ్యత్వానికి వేలల్లో వసూలు చేస్తున్నారు. గ్రామీణ, మండల స్థాయిలో సామాన్య మత్స్యకారులు ఈ మోసానికి
గురవుతున్నారు.
నిధుల దుర్వినియోగం
నిధుల దుర్వినియోగం ఈ సమస్యలకు మూలం. 2015లో తెలంగాణ స్టేట్ ఫిషర్మన్ కో- ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఏర్పాటైంది. 2014-– 2025 మధ్యకాలంలో మత్స్యకారుల అభివృద్ధి, సబ్సిడీలు, రుణాల కోసం రూ.458 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.223 కోట్లు రాష్ట్రానికి విడుదలయ్యాయి. అలాగే 2017-–18లో ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద నేషనల్ కో- ఆపరేటివ్ డెవలప్‌మెంట్
కార్పొరేషన్ ద్వారా రూ.1,000 కోట్ల నిధులను తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించారు.
ఇవి చిన్న, మధ్య తరహా రిజర్వాయర్ల అభివృద్ధి, కేజ్ కల్చర్, చేపల, -రొయ్యల పెంపకం, 24,189 చెరువుల అభివృద్ధికి ఉపయోగపడాల్సి ఉంది. అలాగే, 2016–-2026 మధ్య మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపు కోసం, చేప పిల్లల పంపిణీ కోసం రూ.700 కోట్లు కేటాయించారు. ఈ నిధులు జిల్లాలవారీగా పంపిణీ చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2020–-25 మధ్య రూ.1,968 కోట్ల ప్రాజెక్టులు ఆమోదించారు. కేంద్ర వాటా నిధులు మత్స్యకారుల వరకు చేరడం లేదు.
అవినీతిని అరికట్టాలి
బీమా సమస్యలు మరింత దారుణం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద బీమా అందాల్సి ఉంది. కానీ, ఆర్టీఐ సమాచారం ప్రకారం, 2019-– 2025 మధ్య 1,475 మంది మత్స్యకారులు మరణించగా, కేవలం 804 మందికే బీమా అందింది. మిగిలిన 671 కుటుంబాలు నిబంధనల సాకుతో ఎదురు చూస్తున్నాయి. ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు వంటి పదుల సంఖ్యలో పత్రాలు అడుగుతున్నారు. నిరక్షరాస్యులైన పేదలకు ఇది అసాధ్యం.
మత్స్యశాఖలో నిధుల కొరత, రాజకీయ నాయకులకు అవగాహన లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ శాఖ విస్మరణకు గురవుతోంది. గతంలో గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిష్కారాలు అత్యవసరం. సభ్యత్వాలను ఉచితంగా ఇవ్వాలి. బీమాను సరళీకరించాలి (రైతు బీమా తరహా), సమగ్ర జీవిత బీమా అమలు చేయాలి, పూచీకత్తు లేని రుణాలు అందించాలి. ప్రతి మత్స్యకారునికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిని అరికట్టి, నిధులు సరిగా చేరేలా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఆలస్యమైతే, మత్స్యకారుల బతుకులు మరింత దయనీయమవుతాయి. నీటిపై పోరాడే వీరికి న్యాయం చేయాల్సిన సమయం ఇది.
- డాక్టర్ వై.శివ ముదిరాజ్, హెచ్సీయూ
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ: openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు
