మూగ జీవుల వేసవి రోదన.. బస్సును ఆపి మరీ నీళ్లు తాగిన కొండముచ్చులు.. వీడియో వైరల్

మూగ జీవుల వేసవి రోదన.. బస్సును ఆపి మరీ నీళ్లు తాగిన కొండముచ్చులు.. వీడియో వైరల్

ఎండలకు మనుషులతో సహా అన్ని ప్రాణులు అల్లాడి పోతున్నాయి. అడవిలో చెరువులు, కుంటలు, వాగులు అడుగంటి పోతుండటంతో అడవి జీవుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఎండ వేడిని తట్టుకోలేక పక్షులు, జంతువులు ప్రాణాలు వదులుతున్న పరిస్థితి. బతకటం కోసం ప్రాణాలు చేతిలో పట్టుకుని నీటి కోసం ప్రయాణిస్తున్న జీవులెన్నో. అలాంటి సాహసమే చేసింది ఓ కొండముచ్చు. రన్నింగ్ లో ఉన్న బస్సును ఆపి మరీ దాహం తీర్చుకున్న ఘటన గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించకమానదు.

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కొండముచ్చులు బస్సును ఆపి నీళ్లు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఎండ తీవ్రతకు తాళలేక, దాహం తీర్చుకునేందుకు ఏకంగా ఓ కొండముచ్చు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అడ్డుకుంది. ఈ ఘటన 2026 మే 21వ తేదీన యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది.  

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాషిమ్ నుంచి పుసాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఖండాలా ఘాట్ సమీపంలోకి రాగానే.. ఓ కొండముచ్చు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి బస్సుకు అడ్డుగా నిలబడింది. డ్రైవర్, ప్రయాణికులు ఎంత భయపెట్టినా తప్పుకోలేదు. ఆ మూగజీవి దాహంతో అలమటిస్తోందని గ్రహించిన కొందరు ప్రయాణికులు తమ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లతో దానికి నీరు అందించారు. బాటిల్ లోంచి నీళ్లు తాగుతున్న కొండముచ్చుని చూసిన వెంటనే, సమీప అడవిలో నుంచి మరికొన్ని కోతులు, కొండముచ్చులు పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు చుట్టూ చేరాయి. ఆకలి దప్పులతో ఉన్న ఆ మూగజీవాలను చూసి చలించిపోయిన ప్రయాణికులు, తమ వద్ద ఉన్న నీటిని వాటికి అందించి దాహం తీర్చారు.

  • వీడియో వైరల్..

బస్సును ఆపేసి కొండముచ్చులు నీళ్లు తాగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బస్సులో ఉన్న ప్రయాణీకులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. వేసవిలో అటవీ జంతువుల కోసం కనీస నీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.