లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆర్‌బీఐ బ్రేక్: మారిన రూల్స్ ఇవే..

లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆర్‌బీఐ బ్రేక్: మారిన రూల్స్ ఇవే..

బ్యాంక్ లోన్స్ తీసుకున్న కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఊరటనిచ్చింది. లోన్ రికవరీ పేరుతో రికవరీ ఏజెంట్లు చేసే వేధింపులకు.. మొబైల్ డేటా చోరీకి అడ్డుకట్ట వేస్తూ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.

కొత్త రూల్స్ కింద లోన్ రికవరీ ప్రక్రియ, ఏజెంట్ల ప్రవర్తనపై బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన విధానాన్ని రూపొందించుకోవాలి. రికవరీ ఎప్పుడు ప్రారంభించాలి? లోన్ చెల్లించని వారు మరణిస్తే ఎలా వ్యవహరించాలి? వంటి విషయాలను ఇందులో స్పష్టం చేయాలి. ఒకవేళ ఏజెంట్ల తప్పుడు ప్రవర్తన వల్ల కస్టమర్ నష్టపోతే బ్యాంకే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఇకపై బ్యాంకులు తమకు నచ్చిన థర్డ్ పార్టీ ఏజెంట్లను రికవరీకి పంపడానికి వీల్లేదు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లేదా దాని గుర్తింపు పొందిన సంస్థల ద్వారా సర్టిఫికేట్ పొందిన ఏజెంట్లను మాత్రమే నియమించుకోవాల్సి ఉంటుంది. తమతో అనుబంధం ఉన్న రికవరీ ఏజెంట్ల పూర్తి లిస్ట్, వారి అడ్రెస్, భౌగోళిక పరిధి వంటి వివరాలను బ్యాంకులు తమ వెబ్‌సైట్, యాప్‌లలో ముందుగానే ఉంచాలి.

అంతేకాకుండా రికవరీ ఏజెంట్లు కస్టమర్ ఇంటికి మొదటిసారి వెళ్లేటప్పుడు.. కనీసం ఒక రోజు ముందే కస్టమర్ లేదా గ్యారంటర్లకు సమాచారం అందించడం తప్పనిసరి. ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి. ఏజెంట్లు సభ్యతతో మర్యాదగా మాట్లాడాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల్లో బ్యాంకులను కఠినంగా ఆదేశించింది.

►ALSO READ | ముంబై వర్షాలపై ట్రేడింగ్ చేయెుచ్చు.. తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి వెదర్ డెరివేటివ్స్ వస్తున్నాయ్

కస్టమర్లను అసభ్య పదజాలంతో దూషించడం, పదే పదే ఫోన్లు చేసి వేధించడం, బెదిరింపులకు పాల్పడటం, బంధువులు సహోద్యోగులను ఇబ్బంది పెట్టడం పూర్తిగా నిషేధించబడ్డాయి. కస్టమర్ల వ్యక్తిగత వివరాలను, ఆడియో/వీడియో రికార్డింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి చర్యలపై ఆర్‌బీఐ కఠిన నిషేధం విధించింది.

ముఖ్యంగా కస్టమర్ల మొబైల్ ఫోన్లలోని కాంటాక్ట్స్, ఫోటోలు వంటి వ్యక్తిగత డేటాను రికవరీ ఏజెంట్లు యాక్సెస్ చేయడం కానీ.. స్టోర్ చేసి ఉంచుకోవడం కానీ చేయకూడదు. లోన్ రికవరీ కోసం కస్టమర్ మొబైల్ ఫోన్ ఫీచర్లను నిలిపివేసే టెక్నాలజీని వాడకూడదు. ఒకవేళ సదరు మొబైల్ కొనేందుకే లోన్ తీసుకున్నట్లయితే.. లోన్ గడువు ముగిసి 90 రోజులు దాటిన తర్వాత మాత్రమే ముందస్తు నోటీసు ఇచ్చి ఫోన్ లాక్ చేయాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఫోన్ లాక్ చేసినప్పటికీ.. ఇంటర్నెట్, ఇన్‌కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ SOS, ప్రభుత్వ భద్రతా అలర్ట్స్ వంటి అత్యవసర సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ సర్వీసులు నిలిపివేస్తే.. కస్టమర్‌కు ప్రతి గంటకు రూ.250 చొప్పున బ్యాంక్ పరిహారంగా చెల్లించాలి.

ట్రాన్స్పరెన్సీ కోసం, రికవరీ కోసం చేసే ప్రతి ఫోన్ కాల్ సమయం, నంబర్ సంభాషణను బ్యాంకులు తప్పక రికార్డ్ చేయాలి. ఈ రికార్డులను కనీసం 6  నెలల పాటు భద్రపరచడం తప్పనిసరి. కోర్టు వివాదాలు ఉంటే కేసు ముగిసే వరకు ఆ డేటాను స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ ద్వారా రుణ గ్రహీతల వ్యక్తిగత స్వేచ్ఛకు, గౌరవానికి పూర్తి భద్రత లభించనుందని రిజర్వు బ్యాంక్ పేర్కొంది.