ముంబై వర్షాలపై ట్రేడింగ్ చేయెుచ్చు.. తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి వెదర్ డెరివేటివ్స్ వస్తున్నాయ్

ముంబై వర్షాలపై ట్రేడింగ్ చేయెుచ్చు.. తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి వెదర్ డెరివేటివ్స్ వస్తున్నాయ్

స్టాక్ మార్కెట్ ట్రేడర్స్, ఇన్వెస్టర్లకు ఒక సరికొత్త క్రేజీ అప్‌డేట్. ఇప్పటివరకు మార్కెట్‌లో బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్, షేర్లపై ట్రేడింగ్ చేయడం చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా  వర్షంపై కూడా ట్రేడింగ్ చేసుకునే సరికొత్త అవకాశం రాబోతోంది. దేశంలోని ప్రముఖ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ‘ఎన్‌సీడీఈఎక్స్’ (NCDEX) మొట్టమొదటిగా ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్స్ కాంట్రాక్టును జూన్ 1, 2026 నుంచి ప్రారంభించబోతోంది. సో ఇకపై ముంబై నగరంలో కురిసే వర్షపాతంలో వచ్చే హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ ట్రేడింగ్ కొనసాగనుందన్నమాట.

2026లో గడచిన మూడేళ్లలోనే తొలిసారిగా దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది వ్యవసాయం, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఈ వెదర్ డెరివేటివ్ కాంట్రాక్టులపై ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి పెరిగిపోతోంది. భారత వాతావరణ శాఖ అందించే వర్షపాత గణాంకాల ఆధారంగా ఈ క్యాష్-సెటిల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు పనిచేస్తాయి. వర్షాల వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉన్న అగ్రికల్చర్, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్, పవర్, బ్యాంకింగ్ రంగాలు తమ ఆర్థిక నష్టాలను హెడ్జింగ్ చేసుకోవటానికి ఈ కాంట్రాక్టులు అద్భుతంగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రుతుపవనాల సమయంలో కురిసే భారీ వర్షాల వల్ల బిజినెస్ సప్లై చైన్, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతుంటాయి. సాంప్రదాయ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, ప్రభుత్వ సాయం కంటే వేగంగా ఈ డెరివేటివ్స్ ద్వారా నష్టాలను భర్తీ చేసుకోవచ్చని ఎన్‌సీడీఈఎక్స్ పేర్కొంది. సోషల్ మీడియాలో దీనిపై ప్రకటనలు ఇస్తూ.. "ఒకరికి ఇది కేవలం వర్షం కావచ్చు, కానీ ట్రేడర్లకు ఇదొక అద్భుతమైన అవకాశం" అంటూ ప్రచారం చేస్తోంది. వర్షాన్ని ఒక మార్కెట్ సిగ్నల్‌గా మార్చేస్తూ ‘ట్రేడ్ రెయిన్’ పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త సెగ్మెంట్ ట్రేడింగ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే మరి.