సీఎస్‌కే బౌలర్లపై చెడుగుడు ఆడిన గిల్, సుదర్శన్, బట్లర్.. చెన్నై ముందు 230 రన్స్ టార్గెట్

సీఎస్‌కే బౌలర్లపై చెడుగుడు ఆడిన గిల్, సుదర్శన్, బట్లర్.. చెన్నై ముందు 230 రన్స్ టార్గెట్

CSK vs GT: ఐపీఎల్ 2026 క్లైమాక్స్ రేసులో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ కీలక 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పుడు 230 పరుగుల కొండంత టార్గెట్ ని చేధించాల్సి ఉంది.

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సుదర్శన్ చెడుగుడు: 
టాస్ ఓడినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయని గుజరాత్ ఓపెనర్లు జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. గ్రౌండ్ నలుమూలలా క్లాసిక్ షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడే క్రమంలో.. ఇన్నింగ్స్ 12.2 ఓవర్ వద్ద స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో గిల్ (37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు) భారీ షాట్‌కు ప్రయత్నించి శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయినా మరో ఎండ్ లో ఉన్న సాయి సుదర్శన్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు) చెన్నై బౌలర్లపై ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతడ్ని అన్షుల్ కాంబోజ్ పెవిలియన్ పంపాడు.

బట్లర్ ఊచకోత: 
వన్‌డౌన్‌లో బ్యాటింగ్ కి వచ్చిన విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ అహ్మదాబాద్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. సీఎస్‌కే బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఊచకోత కోస్తూ, మెరుపు హాఫ్ సెంచరీ (అర్థ శతకం) పూర్తి చేసుకున్నాడు. కానీ చివర్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా సింగిల్ తీసే క్రమంలో దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. మిడ్-ఆఫ్ వైపు బంతిని కొట్టి పరుగు కోసం ప్రయత్నించగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మెరుపు వేగంతో బంతిని అందుకుని బౌలింగ్ ఎండ్‌లో డైరెక్ట్ హిట్ చేయడంతో తెవాటియా (గోల్డెన్ డకౌట్) రనౌట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు 13 పరుగులు రాబట్టడంతో జీటీ స్కోరు 229కి చేరింది. మొత్తంగా సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్ వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.