ప్రపంచాన్ని ప్రతిభతో ఆకట్టుకున్న భారతీయుల గురించి ఒకప్పుడు ‘మేధస్సుకు ప్రతీక’ అని చెప్పిన అమెరికా రాజకీయ వర్గాలే ఇప్పుడు ‘నరకగుండాల దేశాల నుంచి వచ్చినవారు’ అని వ్యాఖ్యానించడం కోట్లాది భారతీయుల ఆత్మగౌరవాన్ని కించపరిచింది. అమెరికా నేలపై చెమటోడ్చి, తమ ప్రతిభతో సాంకేతిక రంగాన్ని, వైద్యరంగాన్ని, పరిశోధనా వ్యవస్థను నిలబెట్టిన వలస భారతీయులకు ఈ వ్యాఖ్యలు ఒక ప్రశ్నను ముందుంచాయి.
మనం అక్కడ గౌరవనీయులమా? లేక అవసరం ఉన్నప్పుడే గుర్తుకొచ్చే శ్రమజీవులమా? ఈ వివాదం కేవలం పౌరసత్వ చట్టాల చుట్టూ తిరిగేది కాదు. ఇది ఒక దేశం తన ఆత్మగౌరవాన్ని ఎలా నిర్వచించుకుంటుందన్న దానిపై జరుగుతున్న మౌన పోరాటం. ఒకప్పుడు వలసలతో ఎదిగిన దేశం, ఇప్పుడు అదే వలసలను అనుమానంతో చూడటం ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపుకు సంకేతం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమ ఖాతాలోని రేడియో కార్యక్రమంలో చేసిన ప్రసంగంతో వివాదం చెలరేగింది. ఆ కార్యక్రమంలో ఒక వ్యాఖ్యాత మాట్లాడుతూ ‘చైనా, భారతదేశం లేదా ప్రపంచంలోని ఇతర నరకగుండాల దేశాల నుంచి వచ్చిన వలసదారులు తమ పిల్లలను అమెరికాలో కనగానే వారు అమెరికా పౌరులవుతున్నారు’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘ఇవి నిరాధారమైనవి, అసభ్యమైనవి, దురుద్దేశపూరితమైనవి’ అని ఖండించింది.
భారత్-, అమెరికా సంబంధాల వాస్తవ స్వభావాన్ని ఇవి ప్రతిబింబించవని స్పష్టం చేసింది. ఈ వివాదం మరింత సున్నితంగా మారడానికి ప్రధాన కారణం.. అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘జన్మహక్కు పౌరసత్వం’ పరిమితి నిర్ణయం.
పౌరసత్వం వివాదాస్పదం
అమెరికాలో పుట్టిన ప్రతి శిశువుకూ స్వయంచాలకంగా పౌరసత్వం కల్పించే విధానాన్ని ప్రశ్నిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేయడం దీనికి కేంద్ర బిందువైంది. 1898లో అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఒక కీలక తీర్పు ప్రకారం.. అమెరికా నేలపై జన్మించిన ప్రతి వ్యక్తికి పౌరసత్వ హక్కు ఉంటుంది. తల్లిదండ్రుల వలస స్థితి ఏమిటన్నది అక్కడ ప్రధాన అంశం కాదని స్పష్టం చేసింది. దాదాపు 130 ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. ఇది అమెరికాను ‘వలసల దేశం’గా నిలబెట్టిన ప్రధాన సూత్రాల్లో ఒకటి. 2025 జనవరి 20న విడుదలైన తాజా ఉత్తర్వు రెండు వర్గాలను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. అక్రమంగా నివసిస్తున్న వలసదారుల పిల్లలు, అలాగే ఉద్యోగ, విద్య, వ్యాపార లేదా పర్యాటక అనుమతులతో అమెరికాలో ఉన్నవారి పిల్లలకు కూడా జన్మతోనే పౌరసత్వం ఇవ్వకూడదనే వాదన వినిపిస్తోంది.
ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నవారు చెబుతున్నది ఏమిటంటే.. దేశానికి శాశ్వత అనుబంధం లేనివారికి ఈ హక్కు వర్తించకూడదు. కానీ వ్యతిరేక వాదన మాత్రం మరింత బలంగా ఉంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని, అమెరికా చరిత్రను, వలసలపై నిర్మితమైన దేశ స్వరూపాన్నే ధిక్కరించడం. 2026 ఏప్రిల్‌లో జరిగిన విచారణలో అమెరికా ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు న్యాయమూర్తులు ఈ నిర్ణయంపై తీవ్రమైన సందేహాలు వ్యక్తం చేశారు. ‘ప్రపంచం మారవచ్చు.. కానీ రాజ్యాంగం మారలేదు’ అన్న వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే అనేక దిగువ న్యాయస్థానాలు ఈ ఉత్తర్వును నిలిపివేశాయి. తుది తీర్పుకోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
భవిష్యత్తుపై భరోసా ప్రశ్నార్థకం
భారతీయులు ప్రత్యేకంగా పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం పెద్ద ఎత్తున అమెరికాకు వెళ్తున్నారనే ప్రచారం వాస్తవానికి అతిశయోక్తి. అమెరికాలో భారతీయ సంతతి జనాభా సుమారు 55 లక్షలు. ఉద్యోగ అనుమతులలో భారతీయుల వాటా 70 శాతం కంటే ఎక్కువ. పౌరసత్వం కోసం ప్రసవ ప్రయాణాలు సంవత్సరానికి కొన్ని వేలసంఖ్యలో మాత్రమే ఉంటున్నాయి.
ఇవి అమెరికాలో జరిగే మొత్తం జననాల్లో చాలా చిన్న భాగమే. అమెరికాలో ప్రతి సంవత్సరం లక్షలాది పిల్లలు తాత్కాలిక లేదా అక్రమ వలస స్థితిలో ఉన్న కుటుంబాలకు జన్మిస్తున్నారు. అందులో అధిక శాతం లాటిన్ అమెరికా వంశాలకు చెందినవారే. భారతీయులు అందులో ఒక చిన్న వర్గం మాత్రమే. అమెరికా రాయబార కార్యాలయం కూడా ప్రసవం కోసం మాత్రమే పర్యాటక అనుమతులు పొందే ప్రయత్నాలను కఠినంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అది వారి హక్కే.
కానీ దానిని భారతీయులందరిపై ముద్రవేసేవిధంగా చూపించడం అన్యాయం. ఈ పరిణామం అమెరికాలో జీవిస్తున్న వేలాది భారతీయ కుటుంబాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఇప్పటివరకు అమెరికాలో పుట్టిన పిల్లలకు భవిష్యత్తుపై ఒక భరోసా ఉండేది. ఇప్పుడు ఆ భరోసా ప్రశ్నార్థకంగా మారింది. పౌరసత్వం లేకపోతే ఉన్నత విద్య అవకాశాలు ప్రభావితమవుతాయి. ఉద్యోగ భద్రత తగ్గుతుంది. ప్రభుత్వ ప్రయోజనాలపై అనిశ్చితి పెరుగుతుంది. ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు. ఇది మానసికంగా కూడా భారతీయులను గాయపరుస్తోంది.
అమెరికా అభివృద్ధిలో భారతీయుల కీలక పాత్ర
భారతీయుల మేధస్సు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. సాంకేతిక రంగం నుంచి వైద్యరంగం వరకు భారతీయుల శ్రమ ప్రతిభ, కృషి అమెరికా ఆర్థికవ్యవస్థకు బలంగా నిలిచాయి. అలాంటి ప్రజలను అవకాశవాదులుగా చిత్రీకరించడం ద్వైపాక్షిక సంబంధాలకు మంచిది కాదు. ఈ పరిణామం భారతీయ యువతకు ఒక పెద్ద హెచ్చరిక కూడా.
‘అమెరికా కల’ అనే భావనలో గౌరవం తగ్గిపోతే, ప్రపంచం ముందు ఇంకా ఎన్నో ద్వారాలు ఉన్నాయి. యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు ప్రతిభకు విలువనిస్తే, భారతీయ యువత అక్కడికి వెళ్లడం సహజం. అంతకన్నా ముఖ్యంగా స్వదేశంలోనే అవకాశాలను నిర్మించాలనే ఆలోచన మరింత బలపడవచ్చు. ఈ వివాదం ఒక కీలక ప్రశ్నను ప్రపంచం ముందు ఉంచుతోంది. ప్రతిభను ఆహ్వానించే దేశం కావాలా? లేక అనుమానంతో గోడలు కట్టుకునే దేశం కావాలా? అమెరికా తన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటే అది ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా నిలుస్తుంది.
లేకపోతే, అక్కడికి వెళ్లే మేధస్సు కొత్త మార్గాలను వెతుక్కుంటుంది. భారతీయ యువతకు ఇప్పుడు స్పష్టమవుతున్న ఒక నిజం ఉంది. అమెరికా తలుపులు మూసుకుంటే, ప్రపంచం కొత్త తలుపులు తెరుస్తుంది. అది హెచ్చరిక కాదు. మారుతున్న ప్రపంచ వాస్తవం.
- కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
