రాత్రివేళల్లో మిణుగురు పురుగుల వెలుగులు చూస్తే చాలు ఎవరైనా పరవశించిపోతారు. చుట్టూ అలుముకున్న చీకటిని చీల్చుకుంటూ వేలాది మిణుగురు పురుగులు మిణుకు మిణుకుమంటూ వెలుగులు విరజిమ్మితే అది కళ్లతో చూసేవారికే అర్థమయ్యే ప్రకృతి మాయాజాలం. ఒకప్పుడు అడవులు, పొలాల అంచులు, వాగుల ఒడ్డున తరచూ కనిపించే ఈ జీవకాంతుల ప్రపంచం ఇప్పుడు క్రమంగా మసకబారుతోంది.
తెలంగాణ జిల్లాల్లో వీటిని అగ్గి పురుగు, లైట్ పురుగు, లేదా బిజిలీ పురుగు, వెలుతురు పూలు, జుగ్ను అని పిలుస్తారు. దీన్ని లాంపీరీడీ కుటుంబానికి చెందిన కీటకాలను ఫైర్ ప్లైస్గా పిలుస్తారు. వర్షాకాలంలో జూన్, జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో ఈ పురుగులు చీకటి పడిన తర్వాత రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఎక్కువగా కనిపిస్తుంటాయి. అమ్రాబాద్ పులుల అభయారణ్యం, నల్లమల అడవుల్లో వర్షాకాలం ప్రారంభంలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మిణుగురు పురుగులు కనిపిస్తుంటాయి.
కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లోని దట్టమైన అడవులు, సహజ ఆవాసాల కారణంగా ఈ ప్రాంతం మిణుగురు పురుగులకు అనుకూల నివాసంగా ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి, పెద్దపూర్ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఈ కాంతి వెదజల్లే పురుగులు కనిపిస్తున్నట్లు పరిశోధకుల సర్వేలో వెల్లడైంది.
అడవులు, పొలాల అంచులు, గడ్డి మైదానాలు, చెరువులు, వాగుల దగ్గర ఈ పురుగులు ఎక్కువగా కనిపించేవి. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో 90 రకాల మిణుగురు పురుగులున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది.
కాంతి వెనుక ఉన్న శాస్త్రం
మిణుగురు పురుగులు పొట్టభాగం నుంచి బయోల్యూమినిసెన్స్ అనే సహజ ప్రక్రియ ద్వారా కాంతిని ఉత్పత్తి చేస్తాయి. వీటి శరీరంలో లూసిఫెరేస్ అనే ఎంజైమ్ సాయంతో ఆక్సిజన్, లూసిఫెరిన్ వంటి ప్రత్యేక రసాయనాలతో చర్య జరిపి, మృదువైన, చల్లని కాంతిని ఉత్పత్తి చేస్తుంది.
ఆడపురుగులను ఆకర్షించడానికి..
రాత్రిపూట మగ మిణుగురు పురుగులు ఎగురుతూ వివిధ నమూనాల్లో కాంతిని వెదజల్లుతుంటాయి. ఆడ పురుగులు వాటికి సరిపోయే సంకేతాలతో ప్రతిస్పందిస్తాయి. చీకటిలో ఆడ, మగ పురుగులు ఒకదానికొకటి గుర్తించి కలుస్తుంటాయి. మిణుగురు పురుగులు తమ శరీరంలోకి వచ్చే ఆక్సిజన్ సరఫరాను నియంత్రించగలవు. ఆక్సిజన్ సరఫరాను ఆపినప్పుడు లైట్ ఆరిపోతుంది, ఆక్సిజన్ సరఫరా చేసినప్పుడు లైట్ వెలుగుతుంది.
ఇలా అవి లైట్లను మిణుకు మిణుకుమనేలా చేస్తాయి. ఈ వెలుగు వాటి జతను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. మగ, ఆడ పురుగులు ఒకదానికొకటి ఆకర్షించుకోవడానికి వేర్వేరు సంకేతాలతో లైట్లను రాత్రిపూట వెలిగిస్తాయి. ఈ వెలుగును చూసి పక్షులు, ఇతర జంతువులు ఇవి విషపూరితమైనవని భావించి వీటిని తినడానికి భయపడుతుంటాయి. అలా శత్రువుల నుంచి మిణుగురు పురుగులకు రక్షణ లభిస్తుంది.
మసకబారుతున్న కాంతి
ఒకప్పుడు తెలంగాణలో రాత్రుల్లో మిణుగురు పురుగులు కాంతులతో చెట్లను, పొలాలను కాంతివంతమైన తోటలుగా మార్చేవి. నేడు ఆ కాంతి మసకబారుతోంది. తెలంగాణలో అడవులు, సహజ ఆవాసాల నాశనం కావడం, రసాయన పురుగుమందుల అధిక వినియోగం, కృత్రిమ వెలుతురు వల్ల పెరిగిన కాంతి కాలుష్యం, వాతావరణ మార్పులు, నీటి కాలుష్యం మిణుగురు పురుగులు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ శాస్త్రవేత్త, పరిశోధకుడైన డాక్టర్ ఎనగందుల వెంకట్ చెప్పారు.
దీర్ఘకాలిక పొడి వాతావరణం, సంతానోత్పత్తి ఆవాసాలకు ఆటంకం వల్ల ఈ మిణుగురుల సంఖ్య తగ్గుతుందని తెలంగాణ సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ గోపిడి రోహిత్ చెప్పారు. ఈ కారకాలు మిణుగురు పురుగుల జీవితచక్రం, పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు.
అంతర్జాతీయ సదస్సు
మిణుగురు పురుగుల పరిరక్షణ కోసం హైదరాబాద్ కేంద్రంగా వచ్చే ఏడాది అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఫైర్ ఫ్లై ఆసియన్ అసోసియేషన్, సస్టెనబుల్ వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అసోసియేషన్, ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి హైదరాబాద్ నగరంలో మిణుగురుల పరిరక్షణ సదస్సు కోసం జంతుశాస్త్ర పీహెచ్ డీ స్కాలర్లు కలిసి సన్నాహాలు చేస్తున్నారని ఫైర్ ఫ్లై ఏసియన్ అసోసియేషన్ ప్రతినిధి, కోల్‌కతా యూనివర్సిటీ పీహెచ్ డీ స్కాలర్ పర్వేజ్ ఖాన్ చెప్పారు.
పరిశోధకులు, పరిరక్షకులు, అటవీ నిర్వాహకులకు జ్ఞానాన్ని పంచుకోవడానికి, మిణుగురు పురుగుల మనుగడకు ఎదురవుతున్న ముప్పును చర్చించడానికి ఒక విలువైన వేదికను అందిస్తుందని అటవీశాఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గోపిడి రోహిత్ వివరించారు.
మిణుగురు పురుగుల పరిరక్షణకు..
తెలంగాణలో అంతరించిపోతున్న మిణుగురు పురుగుల (ఫైర్‌ఫ్లైస్) సంరక్షణకు హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇన్ క్యాటలిసిస్ అండ్ సస్టైనబిలిటీ పరిశోధకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో మిణుగురు పురుగుల వ్యాప్తి, జీవావరణం, జాతుల వైవిధ్యం, వాటిపై ప్రభావం చూపుతున్న పర్యావరణ మార్పులను అధ్యయనం చేస్తూ సంరక్షణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.
హైటికాస్ శాస్త్రవేత్తలు అటవీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి మిణుగురు పురుగులు కనిపిస్తున్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. వాటి సంభోగ కాలం, జీవన చక్రం, కాంతి సంకేతాల ప్రవర్తన, నివాస పరిస్థితులపై శాస్త్రీయ సమాచారం సేకరిస్తున్నారు.
సంరక్షించుకుందాం...
టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ మిణుగురు పురుగుల పరిరక్షణపై స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించడానికి స్టోరీ టెల్లింగ్, ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తోంది. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన జంతుశాస్త్ర విభాగాల పీహెచ్‌డీ స్కాలర్లు తెలంగాణలోని అడవుల్లో మిణుగురు పురుగుల జీవన విధానం, అవి ఎదుర్కొంటున్న ముప్పుపై నిరంతరం అధ్యయనం చేస్తున్నారు.
మిణుగురు పురుగుల హాట్ స్పాట్లను గుర్తించి వాటిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. విపరీతంగా రసాయన పురుగుమందులు వాడటం వల్ల మిణుగురు పురుగుల లార్వాలు చనిపోతున్నందున సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. మిణుగురు వెలుగులు మసకబారుతున్నాయంటే మన అడవులు, నేల, నీరు, పర్యావరణ వ్యవస్థ కూడా ప్రమాదంలో పడుతున్నట్లే.
పర్యావరణానికి ఆరోగ్య సూచికలు
మిణుగురు పురుగుల లార్వా స్వచ్ఛమైన నేల, నీటిలో పెరుగుతుంది. కాబట్టి వీటి సంఖ్య తగ్గడం అంటే ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందనే సంకేతంగా భావిస్తారు. ఇవి చిన్న పురుగులను తిని పంటలకు మేలు చేయడంతో పాటు జీవవైవిధ్య సమతుల్యతను కూడా కాపాడతాయి.
సంరక్షణకు చర్యలు
సహజ అటవీ ఆవాసాలను రక్షించడం, అడవుల సమీపంలో ఎల్ఈడీ కృత్రిమ లైటింగ్‌ను తగ్గించడం, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం, తేమతో కూడిన సూక్ష్మ ఆవాసాలను సంరక్షించడం, మిణుగురు పురుగుల పర్యావరణ ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వీటి సంరక్షించవచ్చంటున్నారు కవాల పులుల అభయారణ్యం అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం రామ్మోహన్.
మిణుగురు పురుగులకు ఆశ్రయం ఇచ్చే సహజ ఆవాసాలను పరిరక్షించడానికి అటవీ శాఖ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. మిణుగురు పురుగులపై శాస్త్రీయ అధ్యయనాలు అటవీశాఖ పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
