ఆమె గర్భం.. ఇద్దరి ప్రయాణం... ఆ తొమ్మిది నెలలు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలంటే...

ఆమె గర్భం.. ఇద్దరి ప్రయాణం... ఆ తొమ్మిది నెలలు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలంటే...

గర్భం దాల్చడం మహిళ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన దశ. కానీ అది ఆమె ఒక్కరి ప్రయాణం కాదు.. భార్యాభర్తలు కలిసి చేసే ప్రయాణం. గర్భంలో బిడ్డను మోసేది తల్లే అయినా, ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ భర్త తోడుంటే ఆ తొమ్మిది నెలలు మరింత ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా సాగుతాయి. చిన్నచిన్న సహాయాలు, ప్రేమగా పలకరించడం, ఆమె మనసును అర్థం చేసుకోవడం.. ఇవన్నీ గర్భిణికి ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి.

ఆస్పత్రికి రావడమే బాధ్యత కాదు

చాలామంది భర్త బాధ్యత అంటే ఆస్పత్రికి తీసుకెళ్లడం, వైద్య పరీక్షలకు హాజరుకావడమే అనుకుంటారు. కానీ భర్త పాత్ర అంతటితో ముగియదు. గర్భధారణ సమయంలో శరీరంలో మార్పులతో పాటు భావోద్వేగాల్లోనూ ఎన్నో మార్పులు వస్తాయి. ప్రసవం ఎలా జరుగుతుందో, బిడ్డను ఎలా పెంచాలో అనే ఆందోళనలు కూడా ఉంటాయి. 

కొన్ని రోజులు గర్భిణి చాలా ఉత్సాహంగా కనిపిస్తే, మరికొన్ని రోజులు అలసటగా, అసౌకర్యంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో భర్త ఓపికగా ఉండటం, అర్థం చేసుకోవడం, ఆమెకు తోడుగా నిలవడం ఎంతో అవసరం.

చిన్న సహాయాలే పెద్ద బలం

గర్భిణికి అండగా ఉండాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. పోషకాహారం సిద్ధం చేయడం, ఇంటి పనుల్లో చేయూత ఇవ్వడం, సమయానికి నీళ్లు తాగాలని గుర్తు చేయడం, విశ్రాంతి తీసుకునేలా చూడడం, కలిసి నడకకు వెళ్లడం వంటి చిన్న చిన్న పనులే ఆమెకు పెద్ద ఊరటనిస్తాయి. అలాగే ఇంటి బాధ్యతలన్నీ తన ఒక్కదానిపైనే లేవనే నమ్మకాన్ని కలిగిస్తాయి.

పరీక్షలకు కలిసి వెళ్లండి గర్భధారణ సమయంలో జరిగే వైద్య పరీక్షలకు భర్త కూడా వెళ్లడం మంచిది. దీంతో గర్భం ఎలా ఎదుగుతోందో తెలుసుకోవచ్చు. వైద్యులను నేరుగా ప్రశ్నలు అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ప్రసవానికి ముందు నిర్వహించే అవగాహన తరగతుల్లో పాల్గొంటే ప్రసవం ఎలా జరుగుతుంది, బిడ్డ పుట్టిన తర్వాత తొలి రోజుల్లో ఎలా చూసుకోవాలి అనే విషయాలపై ఇద్దరికీ మంచి అవగాహన ఏర్పడుతుంది.

ప్రసవ సమయంలో భర్త అండే ధైర్యం

ప్రసవం మహిళ జీవితంలో అత్యంత శారీరక, మానసిక ఒత్తిడితో కూడిన దశ. అలాంటి సమయంలో భర్త పక్కన ఉంటే ఆమెకు ఎంతో ధైర్యం వస్తుంది. చేయి పట్టుకుని ధైర్యం చెప్పడం, నొప్పులు వచ్చినప్పుడు ప్రోత్సహించడం, ప్రశాంతంగా ఉండేలా చూడడం, వైద్య బృందంతో కలిసి అవసరమైన సహకారం అందించడం వల్ల ప్రసవ అనుభవం భయంకరంగా కాకుండా కొంత సులభంగా అనిపిస్తుంది.

వినడమూ ఒక గొప్ప సహాయమే

గర్భధారణ సమయంలో హార్మోన్ల ప్రభావంతో భావోద్వేగాలు మారడం సహజం. అలాంటి సమయంలో ఆమె భావాలను తేలిగ్గా తీసుకోకుండా అర్థం చేసుకోవాలి. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మధ్యలో అడ్డుకోకుండా ఆమె చెప్పేది ఓపికగా వినడమే భర్త చేయగలిగే గొప్ప సాయం.

తండ్రి పాత్ర అప్పుడే మొదలవుతుంది

బిడ్డ పుట్టిన తర్వాతే తండ్రి బాధ్యత మొదలవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఆ బాధ్యత గర్భం దాల్చిన రోజు నుంచే ప్రారంభమవుతుంది. గర్భధారణ సమయంలో భార్యతో బాధ్యతలు పంచుకోవడం, ప్రసవ సమయంలో అండగా నిలవడం, బిడ్డ పుట్టిన తర్వాత తొలి రోజుల్లో కలిసి బాధ్యతలు తీసుకోవడం వల్ల భార్యకు మాత్రమే కాదు.. పుట్టబోయే బిడ్డకు కూడా జీవితంలో అత్యుత్తమ ప్రారంభం లభిస్తుంది. గర్భం అనేది  ఆమె ఒక్కరిది కాదు.. భార్యాభర్తలు కలిసి ప్రేమగా, బాధ్యతగా, ఆనందంగా సాగించాల్సిన జీవితంలోని అందమైన ప్రయాణం.

‌‌‌‌‌‌‌‌‌- డాక్టర్ పల్లవి చంద్ర రావుల
డిపార్ట్​మెంట్ ఆఫ్​ ఒబెస్ట్రేటిక్స్ హెడ్,
ఫెర్నాండెజ్ హాస్పిటల్​,
హైదరాబాద్​