హైదరాబాద్‌లో ఫుడ్ మాఫియా.. 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్..

హైదరాబాద్‌లో ఫుడ్ మాఫియా.. 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్..

మన ప్లేట్లలోకి వచ్చే ఫుడ్  ఎంత విషపూరితంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. హైదరాబాద్‌లో హోటళ్లు, మార్కెట్లలో జరుగుతున్న కల్తీల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కేవలం 100 రోజుల్లోనే ఏకంగా 121 టన్నుల కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్  ప్రయోగిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు.

100 రోజుల్లో 'H-FAST' మెరుపు దాడులు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నెట్‌వర్క్‌లను అంతం చేయడానికి 'హెచ్-ఫాస్ట్' (H-FAST) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది ప్రత్యేక సిబ్బందితో కూడిన ఈ టీమ్, జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ ఏడాది మార్చి 19 నుంచి నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఈ 100 రోజుల్లోనే 185 కేసులు నమోదు చేసి, భారీగా విషపూరిత ఆహారాన్ని పట్టుకున్నారు.

ఏ ఏరియాలో ఎన్ని కేసులు 
సిటీ  మొత్తంలో జరిగిన దాడుల్లో ఏరియాల వారీగా నమోదైన కేసులు చూస్తే  రాజేంద్రనగర్ జోన్లో అత్యధికంగా  55 కేసులు, గోల్కొండలో  44 కేసులు, సికింద్రాబాద్లో 35 కేసులు, చార్మినార్ లో 21 కేసులు, శంషాబాద్ లో 13 కేసులు, జూబ్లీ హిల్స్ లో 12 కేసులు, ఖైరతాబాద్ లో 5 కేసులు. 

అసలు ఏం పట్టుబడిందంటే 
కల్తీ ముఠాలు వాడుతున్న పదార్థాలను చూసి అధికారులే షాక్ తిన్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో...
*27 వేల కిలోల అక్రమ, నాసిరకం  అల్లం-వెల్లుల్లి పేస్ట్
*కెమికల్స్, రసాయనాలతో మగ్గబెట్టిన 25 వేల కిలోల  పండ్లు
*ఏకంగా 60 టన్నుల కోడి వ్యర్థాలు, 15 టన్నుల నాసిరకం మాంసం.
*9,260 కిలోల కుళ్లిన ఊరగాయలు
*4 వేల కిలోల కల్తీ ఖోయా, నకిలీ టీపొడి
*వేల కిలోల్లో నకిలీ పనీర్, కెమికల్  క్రీమ్, నెయ్యి, పెరుగు.

ఇవే కాకుండా ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలు, వాటర్ ప్లాంట్లు, సమోసా సెంటర్లు, బేకరీలు, హాస్టళ్ల కిచెన్ల పై కూడా అధికారులు దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు.

హోటళ్లు, వ్యాపారులకు కఠిన రూల్స్
ఆహార వ్యాపారులతో పోలీసులు, అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి ఈ రూల్స్ తప్పనిసరి చేశారు:
*ప్రతి హోటల్, వ్యాపార సంస్థకు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉండాలి.
* ఫుడ్ సర్వ్ చేసే సిబ్బంది అంతా  మాస్కులు, గ్లౌజులు కచ్చితంగా వేసుకోవాలి.
*వాడిన నూనె వాడొద్దు, వంట నూనెను పదే పదే మరిగించి వాడితే కఠిన చర్యలు ఉంటాయి.
*FIFO రూల్: వస్తువులు పాడవకుండా ఉండటానికి పాత స్టాక్‌ను ముందే వాడే పద్ధతిని పాటించాలి.

ఈ నిబంధనలు పాటించకపోతే హోటళ్లను తక్షణమే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. "కల్తీ ఆహారం వల్ల చిన్న పిల్లల ఎదుగుదల దెబ్బతినడమే కాకుండా.. పెద్దల్లో క్యాన్సర్, కిడ్నీలు పాడవడం, గుండె జబ్బులు వస్తున్నాయి. ఇది కేవలం చిన్న మోసం కాదు, అమాయక ప్రజలను చంపడానికి చేస్తున్న ప్రయత్నం. అందుకే ఇలాంటి వారిపై కఠినంగా ఉంటాం" అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

కల్తీపై రోజుకు సగటున 15 దాకా ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజలు ఇస్తున్న సమాచారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కల్తీ సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.