తక్షణమే ఆ యాడ్స్ తొలగించండి: ఇన్‎స్టా‎గ్రామ్‎కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

తక్షణమే ఆ యాడ్స్ తొలగించండి: ఇన్‎స్టా‎గ్రామ్‎కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఇన్‎స్టా‎గ్రామ్ మాతృ సంస్థ మెటాకు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన నిషేధిత కంటెంట్‎ను యాప్‎లో ఎలా అనుమతించారు..? భవిష్యత్‎లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మెటాకు నోటీసులు జారీ చేసింది. 

అలాగే, నిషేధిత CSEAM (చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్) కంటెంట్‎పై తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లో సరైన వివరణ ఇవ్వకపోయినా.. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోయినా ఐటీ యాక్ట్, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ కల్పించే పోక్సో చట్టం, 2012 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మెటా అల్గోరిథం CSEAM కంటెంట్‎ ఉన్న వీడియోలను ప్రోత్సహిస్తోందని.. ప్లాట్‎ఫామ్ భద్రతా చర్యలలో తీవ్రమైన లోపాలను బయటపెడుతోందని ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బీబీసీ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మెటాకు ఈ నోటీసులు జారీ చేసింది. నగ్నత్వం, లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్‌ను మెటా  నిషేధించినప్పటికీ.. ఆ కంపెనీ నేతృత్వంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‎ఫామ్‎లో CSEAM కంటెంట్‎కు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది.

రేప్ వీడియో, చైల్డ్ వీడియో వంటి పదాలతో కూడిన చెల్లింపు ప్రకటనలను ఇన్‌స్టాగ్రామ్ చూపించిందని.. అవి వినియోగదారులను టెలిగ్రామ్ వంటి కొన్ని ఇతర ఛానెళ్లకు మళ్లించాయని ఆరోపణలు ఉన్నాయి. ఆయా ప్లాట్‎ఫామ్‎లలో సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ కంటెంట్ అమ్మకానికి ఉందని బీబీసీ గుర్తించింది. 

బీబీసీ నివేదిక ఆధారంగా మెటాకు నోటీసులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను ప్రోత్సహించే చెల్లింపు ప్రకటనలకు సంబంధించిన ఆరోపణలు నిజమని తేలితే మధ్యవర్తిగా ఉన్నప్పటికీ థర్డ్-పార్టీ కంటెంట్ అనే సాకుతో మెటా తప్పించుకోలేదని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. ప్లాట్‌ఫారమ్‌కు ఆదాయం తెచ్చిపెట్టే ఆ ప్రకటనలకు మెటా బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.