వేసవి తీవ్రత అనగానే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేది మండుటెండలు, మధ్యాహ్నపు ఉష్ణోగ్రతలు మాత్రమే. కానీ, నిజమైన ఆరోగ్య ముప్పు సూర్యాస్తమయం తర్వాతే మొదలవుతోందని నిపుణులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఎండతో పోలిస్తే, రాత్రి వేళల్లో పెరిగే ఈ వేడి వల్ల మానవ శరీరం కోలుకోవడానికి అసలు సమయమే దొరకడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో తేమ శాతం ఎక్కువ కావడం, నగరాల్లో కాంక్రీట్ కట్టడాల వల్ల గుండె జబ్బులు, డీహైడ్రేషన్, నిద్రలేమి, ప్రాణనష్టం వంటి ముప్పులు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయని వైద్యులు, వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు.
గతంలో రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడటం వల్ల పగటిపూట ఎండకు గురైన మానవ శరీరం తన ఉష్ణోగ్రతను సమతూకంలోకి తెచ్చుకునేది. కానీ, ప్రస్తుత వడగాడ్పుల వల్ల, ముఖ్యంగా నగరాలలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ నిరంతర వేడి శరీరంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా సుదీర్ఘ కాలం పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె, శ్వాసకోశ, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులు మరింత తీవ్రమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరోవైపు తీవ్ర ఎండలతో దేశంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మంగళవారం దేశ పీక్ పవర్ డిమాండ్ 260.5 గిగావాట్లకు చేరి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది.
నిపుణుల హెచ్చరికలు ఇవే..
ఇకపై హీట్‌వేవ్‌లు అప్పుడప్పుడూ వచ్చే పరిస్థితులు కావని, భవిష్యత్తులో ఇవి మరింత ఎక్కువ కాలం, మరింత తీవ్రంగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పట్టణ ప్రణాళిక, చెట్ల పెంపకం, హీట్ యాక్షన్ ప్లాన్స్‌పై ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టాలని, లేకపోతే మున్ముందు మరింత తీవ్ర వేడి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
