నిప్పుల ఎండతో బాందా సిటీ షట్ డౌన్..రాత్రిసమయంలో పొలంపనులు

నిప్పుల ఎండతో బాందా సిటీ షట్ డౌన్..రాత్రిసమయంలో పొలంపనులు
  • 75 ఏళ్ల తర్వాత బాందాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
  • 48 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు
  • ఇంతకుముందుకు రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చురు, జైసల్మేర్ ప్రాంతాల్లో అత్యధిక వేడి నమోదు 

నిరంతరాయంగా నమోదవుతున్న రికార్డు ఉష్ణోగ్రతలు యూపీలోని బాందా జిల్లాను దేశంలోనే అత్యంత తీవ్రమైన వేడి ప్రాంతాల సరసన నిలబెట్టాయి. ఇంతకుముందు రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చురు, జైసల్మేర్ ప్రాంతాల్లో అత్యధికంగా వేడి నమోదవుతుండేది. ఎండల తీవ్రతతో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకే బాందా నగరం పూర్తిగా మూతబడుతోంది. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాందా మొత్తం షట్ డౌన్ అయినట్టు కనిపిస్తోంది. 

చివరకు సాయంత్రం పొద్దుగూకిన తర్వాత గానీ జనం రోడ్లపైకి రావడంలేదు. బాందాలో ఏప్రిల్ 27న 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ రోజు దేశంలోనే ఇది అత్యధికం.1951 తర్వాత ఇక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత కూడా ఇదే. మంగళవారం బాందాలో మళ్లీ 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా కొత్త రికార్డు సృష్టించింది. ఇక పగటిపూట ఎండలో పనిచేయడం అసాధ్యం కావడంతో, రైతులు రాత్రి వేళల్లో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్ల వెలుతురులో పొలం పనులు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య పనిచేయడానికి నిరాకరిస్తూ, కార్మికులు తమ రోజువారీ వేతనాల్లో 40 శాతం వరకు నష్టపోవడానికి కూడా సిద్ధపడుతున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 

ఉత్తర, మధ్య భారత్​లో ఎండలు.. దక్షిణాదిన వర్షాలు   

ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో బుధవారం తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు కొన సాగాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం ఉం టుందని హెచ్చరిస్తూ ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిం ది. రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్, తెలంగాణ, కోస్తా ఆంధ్రా, యానాం, మరఠ్వాడా, ఒడిశా ప్రాంతాలలో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని లిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, లక్షద్వీప్ ప్రాంతాలలో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గంగా నదీ పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ప్రపంచ వాతావరణం, స్థానిక సమస్యలు.. 

దేశంలో వేడి తీవ్రంగా పెరగడానికి ప్రపంచ వాతావర ణ మార్పులతోపాటు స్థానిక సమస్యలూ కారణమవు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మే నుంచి జులై మధ్య ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీనివల్ల భారత ఉపఖండంలో తేమ తగ్గి, ముందస్తు వేసవి తాపం పెరుగుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా (92 శాతం మాత్రమే) నమోదవుతుందని ఐఎండీ అంచనా వేయడానికి ఎల్ నినోనే ప్రధాన కారణం. స్థానిక కారణాల విషయానికి వస్తే.. సుదీర్ఘ పొడి వాతావరణం, మేఘాలు లేకపోవడం వల్ల ఎండలు ముదురుతున్నాయి. నగరాల్లో కాంక్రీట్ భవనాలు, వాహనాలు, ఏసీలు, పరిశ్రమల వల్ల వేడి ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాలలో అడవుల మంటలు, చెట్లు లేని ఖాళీ భూములు వేడిని పెంచుతున్నాయి.