ఆగస్టు నెల దర్శన కోటాకు సంబంధించి కీలక అప్ డేట్ రిలీజ్ చేసింది టీటీడీ. ఆగస్టు నెలకు సంబంధించి దర్శనాలు, గదుల కోటా వివరాలు వెల్లడించింది టీటీడీ. ఈ రోజు ( 2026 మే 21) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అదే విధంగా వార్షిక పవిత్రోత్సవాల (23-08-26 నుండి 25-08-26) టికెట్లను కూడా మే 21 ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
వర్చువల్ సేవల కోటా విడుదల : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.
23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల: అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి దర్శన కోటా విడుదల: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల: ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల: తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది టీటీడీ.
